తూర్పు గోదావరి జిల్లా రాజోలు వైసీపీలో వర్గ పోరు భారీ ఎత్తున సాగుతోంది. తాజాగా మంత్రి మోపిదేవి రంగంలోకి దిగి పరిస్థితి ని చక్కబరిచే చర్యలు చేపట్టినా.. ఫలితం కనిపించలేదు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఆ పార్టీ అధిష్ఠానం రంగంలోకి దిగిం ది. ఇరువర్గాలతో సమావేశాలు నిర్వహించి వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఇవాళ జిల్లా ఇన్‌చార్జి మంత్రి మోపిదేవి వెంకట రమణ రంగంలోకి దిగారు.
బొంతు రాజేశ్వరరావుకు పార్టీ అన్యాయం చేయదని పార్టీ ఆరంభం నుంచి కష్టపడి పని చేసిన వారికి పార్టీ తోడుగా ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసిన వారికే మార్కెట్ యార్డు చైర్మన్, ఇతర పదవులు ఉంటాయని మరో మంత్రి పినిపే విశ్వరూప్ వెల్లడించారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. ఏ నాయకుడిని పార్టీ సస్పెండ్ చేయలేదని.. అందరూ వైఎస్సార్ కుటుంబ సభ్యులేనని చెప్పుకొచ్చారు. దీంతో ఇక, రాజోలు సమస్య పరిష్కారం అయినట్టేనని అందరూ అనుకున్నా రు.
కానీ, మంత్రులు అలా వెళ్లగానే ఇలా మళ్లీ నాయకులు సోషల్ మీడియా వేదికగా వర్గ పోరుకు దిగారు. అమ్మాజీ వర్గం అనుచరులు.. తమకే నామినేటెడ్ పదవులు దక్కుతాయనే ప్రచారం ప్రారంభించింది. దీంతో బొంతు వర్గం తీవ్రస్థాయిలో ఫైరైంది. ఇదే విషయాన్ని తాము అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొంది. అయితే, బొంతు వ్యాఖ్యలను అమ్మాజీ వర్గం లైట్ తీసుకుంది. అంతేకాదు, ప్రస్తుతం తమకు జగన్ దగ్గర యాక్సస్ ఉందని.. ఇప్పుడు బొంతును ఎవరూ నమ్మబోరని అమ్మాజీ వర్గం బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం. దీనిపై ఇరు వర్గాలు కూడా మంత్రులతో సమావేశం అనంతరం కూడా సోషల్ మీడియా వేదిగా వాదన చేసుకోవడంతో అసలు ఈ పరిస్థితి ఎప్పుడు ఎక్కడ ముగుస్తుందోనని వైసీపీ సానుభూతి పరులు భావిస్తున్నారు.
మొత్తానికి గడిచిన ఏడేళ్లుగా కూడా బొంతు ఈ నియోజక వర్గంలో వైసీపీకి అండగా నిలుస్తున్నారు. అయితే, ఇటీవల కాలంలో వేరే పార్టీ నుంచి గెలిచిన నాయకుడి ప్రభావం, ఆయనకు సొంత పార్టీలో ఉన్నవారు వత్తాసు పలకడం, నామినేటెడ్ పదవుల విషయంలో నెలకొన్న సందిగ్ధత వంటివి ఇక్కడ రాజకీయాలు హీటెక్కించారు. అయితే, దీనిని సర్దు బాటు చేసుకోవడం కోసం జగన్ ప్రయత్నించినా.. ఇవి సర్దు బాటు కాకపోవడం గమనార్హం.