ఆ మాజీ మంత్రికి ఎమ్మెల్సీ కట్టబెట్టడం పై గులాబీదళంలో నజర్

-

గ్రేటర్‌ వరంగల్‌లో టీఆర్‌ఎస్‌లో గ్రూపులు కాకపుట్టిస్తున్నాయి.కార్పోరేషన్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని మాజీ మంత్రి సారయ్యను తెరపైకి తెచ్చింది టీఆర్‌ఎస్‌. అన్యూహ్యంగా ఈ మాజీ మంత్రికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. సారయ్యకు ఎమ్మెల్సీ ఇవ్వడం అధికారపార్టీలో చర్చకు దారితీస్తే.. ఇప్పుడు వరంగల్‌ జిల్లాలో ఆయనకు పార్టీ కేడర్ స్వాగతం పలికిన తీరు మరో చర్చకు దారి తీసింది.

ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా వరంగల్‌కు వచ్చిన మాజీ మంత్రి బస్వరాజు సారయ్యకు ఆయన అనుచరులు మడికొండ దగ్గర ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఆయన ఇంటి వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ హడావిడి బాగానే ఉన్నా.. సారయ్యకు స్వాగతం పలికిన వారిలో అనుచరులు తప్ప ఇతర జిల్లాస్థాయి టీఆర్‌ఎస్‌ నేతలు ఎవ్వరూ కనిపించకపోవడంతో పార్టీలో చర్చకు దారితీస్తోంది. దీంతో సొంత ఇమేజ్‌ పెంచుకోవడం కోసమే సారయ్య ర్యాలీని ఏర్పాటు చేశారా అన్న గుసగుసలు మొదలయ్యాయి.

వరంగల్‌ తూర్పు నియోజకవర్గానికి చెందిన మున్సిపల్‌ కార్పొరేటర్లు సైతం సారయ్యకు స్వాగతం పలకడానికి రాలేదు. సారయ్య సీనియారిటీని పార్టీ పెద్దలు గుర్తించినా.. లోకల్‌ కేడర్‌తోపాటు నాయకత్వం గుర్తించడం లేదనే కామెంట్స్‌ జోరందుకున్నాయి. 2021లో జరిగే గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను దృష్టిలో పెట్టుకునే సారయ్యకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినట్టు టీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి. కానీ.. ఇలా పదవి వచ్చిన కొత్తలోనే ఆయనతో ఎడముఖం పెడముఖంగా ఉంటే ఎలా అన్నది కొందరి ప్రశ్న.

ఆ మధ్య భారీ వర్షాలకు వరంగల్‌ నీట మునిగింది. అప్పటి నుంచి అధికార పార్టీ నేతలపై స్థానికులు కోపంగా ఉన్నారు. కొన్ని రాజకీయ సమీకరణల్లో భాగంగా సారయ్యన్ని టీఆర్ఎస్ అధిష్టానం తెరపైకి తెచ్చింది. అయినా సరే వరంగల్ టీఆర్‌ఎస్‌ నేతలు ఆయన్ని పట్టించుకోకపోవడంతో ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషణలు, చర్చలు చేసేస్తున్నారు. అయితే.. పార్టీలోని మరికొందరి వాదన ఇంకోలా ఉందట. సారయ్య వస్తున్నారని ఆయన అనుచరులు జిల్లాలోని ఇతర టీఆర్‌ఎస్‌ నేతలకు చెప్పారో లేదో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారట. సారయ్య రాకపై సమాచారం, ఆహ్వానం లేకపోవడం వల్లే పిలవని పేరంటానికి వెళ్లడం ఎందుకనే వెళ్లలేదన్నది కొందరి మాట.

ఈ విషయంలో ఎవరి విశ్లేషణ ఎలా ఉన్నా.. గ్రేటర్‌ వరంగల్‌లో ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో గ్రూపులు రాజ్యమేలుతున్నాయి. ఇప్పుడు సారయ్యకు పదవి రావడంతో మరో గ్రూపు తయారైందనే వారు ఉన్నారు. ఇదే సమయంలో ఆయన అనుచరులు సారయ్య కాబోయే మంత్రి అంటూ కామెంట్స్‌ చేయడం ఇతర నాయకులకు కంటగింపుగా ఉందట. సారయ్యకు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా పార్టీ ఏదో ఆశిస్తే.. మరేదో జరుగుతోందన్న వారు వరంగల్‌లో ఎక్కువయ్యారు. మరి.. గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికల నాటికి ఈ వర్గపోరు సర్దుకుంటుందో లేక పార్టీ పెద్దలకు కొత్త తలపోట్లు తీసుకొస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version