వరంగల్‌లో యువకుడి దాతృత్వం

-

అత్యవసర సేవలందిస్తూ, 24 గంటలూ పనిచేస్తున్న పోలీసుల కష్టానికి చలించాడో వరంగల్ యువకుడు. వారికి ఇతోధికంగా సహాయపడి మన్ననలను అందుకున్నాడు.

కరోనా.. కరోనా… ఎక్కడ చూసినా, ఎవరు దగ్గినా, తుమ్మినా భయం.. భయం. వారివైపు అనుమానంగా చూడటం ప్రజలకు అలవాటైపోయింది. ఎక్కడ ఎటువంటి పరిస్థితులున్నాయో తెలియదు. జనమంతా బిక్కుబిక్కుమంటూ ఇళ్లల్లో గడుపుతూంటే, అత్యవసర సేవల పేరిట కొన్ని ప్రభుత్వ విభాగాలు 24 గంటలూ రోడ్లమీదే ఉంటూ ప్రజల కోసం సేవ చేస్తున్నారు. పోలీసులు, సానిటేషన్‌ సిబ్బంది ఇందులో అగ్రభాగాన నిలుస్తారు.

ఎర్రని ఎండలో, చెమటలు కక్కుతూ, పనిపాటా లేకుండా రోడ్డెక్కుతున్న జనాన్ని అదలగొడుతూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు పోలీసులు. వలస కూలీలలను సైతం పట్టించుకుని అన్నం పెడుతున్న నేతలు, దాతలు వీరిని అసలు చూడటమే లేదు. ఇది గమనించిన ఒక యువకుడు చలించిపోయాడు. తనకు చేతనైనంతలో సహాయం చేయాలనుకున్నాడు.

నగరంలోని గోపాలపురానికి చెందిన గన్ను వరుణ్‌, పోలీసుల కష్టాన్ని చూసి తనవంతుగా మూడు చోట్ట శిబిరాలు ఏర్పాటు చేసి, పోలీసులకు భోజనం, పండ్లు, నీళ్ల బాటిళ్లు పంపిణీ చేసాడు. కాజీపేట, మడికొండ, ధర్మసాగర్‌లలో ఈ కార్యక్రమం చేపట్టాడు. రేపు కూడా ఇది కొనసాగిస్తానని, పోలీసుల సేవకు ఇది తన ఉడతాభక్తి మాత్రమేనని తెలిపిన వరుణ్‌, రాబోయే రోజులలో తనకు వీలైనంతగా సహాయం చేస్తానని అన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version