Laptop Health Checkup : మీ ల్యాప్‌టాప్‌/పీసీ హెల్త్ ఎలా ఉంది..?

-

మీ కంప్యూటర్/ల్యాప్‌టాప్‌ హెల్త్ ఎలా ఉంది..? ల్యాప్‌టాప్‌ హెల్త్ ఏంటి అనుకుంటున్నారా..! మన ఆరోగ్యం గురించి మనం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నామో.. మన రోజూ వినియోగించే కంప్యూటర్/ ల్యాప్‌టాప్‌ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి మరి. ఇదేంటని ఆశ్చర్యపడకండి. అదేనండీ..! మీ ల్యాప్‌టాప్‌ పనితీరుని గమనిస్తున్నారా..? మీరు ఇంపార్టెంట్ పని చేస్తున్నప్పుడు సడెన్ గా ల్యాప్‌టాప్‌ హ్యాంగ్ అయితే ఎంత చిరాకు వస్తుంది.. వస్తుంది కదా..! అందుకే మీ కంప్యూటర్ ల్యాప్‌టాప్‌ హెల్త్ పై కూడా ఫోకస్ చేయమనేది.

మనకు ఆరోగ్యం బాగోలేకపోతే హెల్త్ చెకప్ చేయించుకుంటాం కదా.. తలనొప్పిగా ఉంటే తలకు సంబంధించిన ఎక్స్ రే, స్కానింగ్.. కాళ్లకు సంబంధించిన సమస్య అయితే వాటికి సంబంధించిన చెకప్.. ఇలాగే కంప్యూటర్ ల్యాప్‌టాప్‌ల వివిధ భాగాలకు సంబంధించి వివిధ రకాల చెకప్ ఉంటుంది. వాటికి రిపోర్ట్ కూడా ఉంటుందండోయ్. వీటిని విండోస్ సెక్యూరిటీ, పర్ఫామెన్స్ మానిటర్ వంటి ద్వారా పొందొచ్చు. మరి మీ కంప్యూటర్ ల్యాప్‌టాప్‌ హెల్త్ ఎలా ఉంది..? వాటిని ఎలా చెక్ చేయాలి..? వాటి రిపోర్టులు ఎలా పొందాలంటే..?

పీసీ హెల్త్‌ చెక్ యాప్.. విండోస్‌ 11 విడుదల సందర్భంగా మైక్రోసాఫ్ట్‌ పీసీ హెల్త్‌ చెక్‌ అనే యాప్‌ను పరియం చేసింది. ఇది డీఫాల్ట్‌గా విండోస్‌ 11తోపాటే వస్తుంది. మైక్రోసాఫ్ట్ వెబ్‌సైట్‌ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని ముఖ్యఉద్దేశం విండోస్‌ 10 ఓఎస్‌తో పనిచేస్తున్న కంప్యూటర్లలో విండోస్‌ 11కు అనువైన ఫీచర్లు ఉన్నాయా? లేదా? అని చెక్ చేయడం. ఈ యాప్‌ను పీసీ హెల్త్‌ చెక్‌ చేసేందుకు కూగా ఉపయోగించవచ్చు. యాప్‌ ఓపెన్ చేయగానే అందులో మీ డేటా వన్‌డ్రైవ్‌లోకి బ్యాకప్‌ చేసుకోమని సూచిస్తుంది. దానితోపాటు పీసీ అప్‌డేట్‌, స్టోరేజ్‌ స్పేస్‌, బ్యాటరీ లైఫ్‌ గురించిన సమాచారం చూపిస్తుంది. టిప్స్‌ ఆన్‌ పీసీ హెల్త్‌ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే కంప్యూటర్‌/ల్యాప్‌టాప్‌కు అవసరమైన సూచనలు చేస్తుంది.

విండోస్‌ సెక్యూరిటీ.. ఈ ఫీచర్‌తో కంప్యూటర్‌/ల్యాప్‌టాప్‌ పనితీరు గురించిన పూర్తి సమాచారం పొందవచ్చు. విండోస్‌ సెక్యూరిటీ ఓపెన్ చేస్తే అందులో డివైజ్‌ ఫెర్మామెన్స్ అండ్‌ హెల్త్‌ అనే సెక్షన్‌ ఉంటుంది. అందులో హెల్త్‌ రిపోర్ట్ సెక్షన్‌ ఓపెన్‌ చేస్తే స్టోరేజ్‌ కెపాసిటీ, యాప్స్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్‌, బ్యాటరీ లైఫ్‌, విండోస్‌ టైమ్‌ సర్వీస్‌ అంటూ నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి. ఇవి నాలుగు చక్కగా పనిచేస్తుంటే నో ఇష్యూస్‌ అని చూపిస్తుంది. ఒకవేళ వీటిలో ఏదైనా లోపం ఉంటే రెడ్‌ మార్క్‌ చూపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే ఏం సమస్య ఉంది? దాని ఎలా పరిష్కరించాలనేది సూచిస్తుంది.

పెర్ఫామెన్స్‌ మానిటర్‌.. విండోస్‌10/11 యూజర్లు ఈ అడ్వాన్స్‌డ్‌ టూల్‌తో కంప్యూటర్‌/ల్యాప్‌టాప్‌ డిస్క్‌, స్టోరేజ్‌, నెట్‌వర్క్‌ వినియోగం ఎలా ఉందనే సమాచారాన్ని తెలుసుకోవచ్చు. సెర్చ్‌బార్‌లో పెర్ఫామెన్స్‌ మానిటర్‌ అని టైప్‌ చేసి టూల్‌ను ఓపెన్ చేయాలి. ఇందులో సిస్టమ్‌ డయాగ్నస్టిక్స్‌, సిస్టమ్‌ పెర్ఫామెన్స్‌ అని రెండు రిపోర్టులను యూజర్‌ పొందవచ్చు. వీటికోసం పెర్ఫామెన్స్‌ మానిటర్ విండోలో ఎడమవైపు ఉన్న డేటా కలెక్టర్‌ సెట్స్‌పై క్లిక్ చేస్తే సిస్టమ్‌ అనే సెక్షన్‌ కనిపిస్తుంది. దానిపై రైట్ క్లిక్ చేస్తే సిస్టమ్‌ డయాగ్నస్టిక్స్‌, సిస్టమ్‌ పెర్ఫామెన్స్‌ ఆప్షన్లు ఉంటాయి. వాటిని సెలెక్ట్‌ చేసి స్టార్ట్‌పై క్లిక్ చేస్తే, ఒకటి లేదా రెండు నిమిషాల తర్వాత రిపోర్ట్స్‌ జనరేట్ అవుతాయి. వాటిని రిపోర్ట్స్‌ సెక్షన్‌లో సిస్టమ్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

స్లీప్‌ స్టడీతో బ్యాటరీ హెల్త్‌.. ఈ ఫీచర్‌తో ల్యాప్‌టాప్‌ బ్యాటరీ పనితీరు గురించి తెలుసుకోవచ్చు. ఎన్నిసార్లు ల్యాపీ బ్యాటరీ ఛార్జింగ్ పూర్తిగా అయిపోయి తిరిగి ఛార్జ్‌ అయ్యిందనేది తెలుస్తుంది. అలానే ఏయే యాప్‌లు ఎంత బ్యాటరీని ఉపయోగిస్తున్నానేది తెలుసుకోవచ్చు. విండోస్‌ 10/11 కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌లో కమాండ్‌ ప్రాంప్ట్‌లోకి వెళ్లి powercfg /SleepStudy /output %USERPROFILE%\Desktop\mysleepstudy.html అని కమాండ్ ఇవ్వాలి. తర్వాత మీ డెస్క్‌టాప్‌ స్క్రీన్‌ మీద mysleepstudy.html పేరుతో ఫైల్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే కంప్యూటర్‌/ల్యాప్‌టాప్‌ బ్యాటరీని ఏయే యాప్‌లు ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి.. ఎన్నిసార్లు బ్యాటరీ పూర్తిగా ఛార్జ్‌ అయిపోయింది.. లో-బ్యాటరీతో ఎన్నిసార్లు ఉపయోగించారనేది తెలుస్తుంది. పైన్‌ పేర్కొన్న కమాండ్‌ కేవలం మూడు రోజుల రిపోర్ట్‌ను మాత్రమే చూపిస్తుంది. ఒకవేళ రెండు లేదా మూడు వారాల రిపోర్ట్‌ కావాలంటే html తర్వాత /duration days అని టైప్‌ చేసి రోజుల సంఖ్య టైప్‌ చేస్తే అప్పటి రిపోర్ట్‌ వస్తుంది. గరిష్ఠంగా 28 రోజుల రిపోర్ట్‌ మాత్రమే ఈ కమాండ్‌ ద్వారా పొందవచ్చు.

హెల్త్ చెకప్ అన్నాం కదా అని ప్రతిరోజూ చేయనక్కర్లేదు. మనకు హెల్త్ బాగోలేనప్పుడే డాక్టర్ వద్దకు ఎలా వెళ్తామో..మీ కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ పనితీరు నెమ్మదించినప్పుడు, తరచుగా సమస్యలు ఎదురవుతున్నప్పుడు మాత్రమే ఈ చెకప్ చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల ఏ విభాగంలో సమస్య ఉందనేది సులభంగా తెలుసుకోవచ్చు. కంప్యూటర్‌ పనితీరులో ఏవైనా సాధారణ సమస్యలుంటే విండోస్‌ సెక్యూరిటీ సిస్టమ్‌ యూజర్‌కు తెలియజేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version