బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ముంబై పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ సింగ్ కేసు విషయంలో ముంబై పోలీసులను అస్సలు నమ్మలేమని ఆమె వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆమె తాజాగా అభిమానులతో సోషల్ మీడియా లైవ్ చాట్‌లో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె సుశాంత్ కేసుకు సంబంధించి పలు వ్యాఖ్యలు చేసింది.
ముంబై పోలీసులు బయటకు సుశాంత్ కేసును బాగానే దర్యాప్తు చేస్తున్నట్లు కనిపిస్తున్నారని, కానీ అదంతా వట్టి షో మాత్రమేనని తనుశ్రీ పేర్కొంది. వారు అలా విచారణ పేరిట కాలయాపన చేస్తారేగానీ అసలు దోషులను పట్టుకోరని వ్యాఖ్యలు చేసింది. కనుక ఈ విషయంలో సీబీఐచే.. ఇంకా అవసరం అయితే ఇంటర్‌పోల్‌తో కూడా విచారణ జరిపించాలని అభిప్రాయపడింది. ఇలాంటి కేసులను సీరియస్‌గా తీసుకోవాలని, ఇందులో అండర్‌వరల్డ్ ప్రమేయం కూడా ఉండి ఉడవచ్చని, కనుక ఇంటర్‌పోల్ చే విచారణ జరిపించాలని అభిప్రాయపడింది.
ముంబై పోలీసులు అసలు నేరస్థులను రక్షించడానికే ప్రయత్నిస్తుంటారని తనుశ్రీ వ్యాఖ్యానించింది. గతంలో తాను నానా పటేకర్‌పై వేధింపుల కేసు పెట్టినప్పుడు కూడా ఇలాగే కాలయాపన చేసి కేసును నీరుగార్చారని, అందువల్ల ముంబై పోలీసులను అస్సలు నమ్మకూడదని, వారు రాజకీయ నేతలు, బాలీవుడ్ పెద్దలను రక్షిస్తారని ఆరోపణలు చేసింది.