PSLV C-54 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ.. అన్ని ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్య లోకి రాకెట్ చేర్చిందన్నారు. నూతన టెక్నాలజీని ఈ ప్రయోగంలో ఉపయోగించామని.. రాకెట్ డిజైన్ లో కొన్ని మార్పులు చేశామని తెలిపారు. ఉపగ్రహాలు బాగా పని చేస్తున్నాయని.. ఓషన్ శాట్ ద్వారా సముద్రంలో చేపల లభ్యత.. వాతావరణ పరిస్థితులు.. తుపానుల సమాచారం తెలుసుకోవచ్చన్నారు.
వచ్చే ఏడాది లో మరిన్ని ప్రయోగాలు చేపడతామన్నారు సోమనాథ్. సూర్యుడి పై పరిశోధనలకు ఆదిత్య..ఎల్.1 తో పాటు, జి.ఎస్.ఎల్.వి.ద్వారా ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. ఇక గగన్ యాన్ కు సంబంధించి పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. నావిక్ ద్వారా సొంత జి.పి.ఎస్. వ్యవస్థ ను రూపొందిస్తున్నామన్నారు. ఈ సిరీస్ లో కొన్ని ఉపగ్రహాలు పని చేయడం లేదని.. వాటి స్థానంలో ఐదు కొత్త ఉపగ్రహాలను ప్రయోగిస్తామన్నారు.