పీవోకే కోసం ప్రాణాలైనా ఇస్తాం.. లోక్‌సభలో అమిత్‌షా సంచలన వ్యాఖ్యలు..

-

కాశ్మీర్ అంశంతో ఇతర దేశాలకు సంబంధం లేదని అమిత్ షా అన్నారు. పీవోకేను స్వాధీనం చేసుకునేందుకు అవసరమైతే తమ ప్రాణాలను సైతం అర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.

జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370తోపాటు ఆర్టికల్ 35ఎ ను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం విదితమే. ఈ మేరకు నిన్న రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. అందులో భాగంగానే సోమవారం కాశ్మీర్ విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇక మంగళవారం అమిత్‌షా ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

లోక్‌సభలో కాశ్మీర్ విభజన బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. జమ్మూకాశ్మీర్ విషయంలో ఏ చట్టం చేయాలన్నా భారత పార్లమెంట్‌కు పూర్తి అధికారాలు ఉంటాయన్నారు. చట్టం చేయకుండా ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్, చైనా ఆక్రమించిన ఆక్సాయ్ చిన్ సైతం భారత్‌కు భూభాగాలేనని, రాజ్యాంగంలో ఈ విషయాన్ని స్పష్టంగా ప్రస్తావించారని షా తెలిపారు.

కాశ్మీర్ అంశంతో ఇతర దేశాలకు సంబంధం లేదని అమిత్ షా అన్నారు. పీవోకేను స్వాధీనం చేసుకునేందుకు అవసరమైతే తమ ప్రాణాలను సైతం అర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. కాశ్మీర్ అంశం భారత్ అంతర్గత వ్యవహారమని, ఇప్పటికే ఈ విషయాన్ని పాకిస్థాన్‌తో జరిపిన పలు ద్వైపాక్షిక చర్చల్లో తెలిపామని ఆయన అన్నారు. ఇక కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ కోరుకుంటుందా..? అని కూడా అమిత్ షా ప్రశ్నించారు. జమ్మూ కాశ్మీర్ భారత్‌లో భాగం కాదని చెప్పాలనుకుంటున్నారా ? అని షా కాంగ్రెస్‌ను అడిగారు.

జమ్మూ కాశ్మీర్‌ను భారత్‌లో సంపూర్ణంగా విలీనం చేస్తున్నామని, ఈ క్రమంలోనే జమ్మూకాశ్మీర్ పునర్విభజన బిల్లు దేశ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయంగా మిగిలిపోతుందని షా అన్నారు. ఆర్టికల్ 370 రద్దుకు పార్లమెంట్ ఆమోదం అవసరం లేదని తెలిపారు. రాష్ట్రపతి గెజిట్ ఇస్తే చాలని అమిత్ షా అన్నారు. కాగా లోక్‌సభలో షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. కాశ్మీర్ విభజన బిల్లు గురించి, ఆర్టికల్ 370 రద్దు గురించి తమకు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. కాగా ఓ వైపు కాంగ్రెస్ పార్టీ ఉభయ సభల్లో ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే.. మరోవైపు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలే కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తుండడం విశేషం..!

Read more RELATED
Recommended to you

Exit mobile version