తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక.. మరో రెండు రోజులు పాటు.. !

-

హైదరాబాద్‌: ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీసగఢ్‌ పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 0.9 కి.మీ వద్ద ఏర్పడింది. గాలి విచ్ఛిన్నతి తెలుగు రాష్ట్రాలపై సముద్ర మట్టానికి 1.5 కి.మీ వరకు ఉంది. మరోవైపు నైరుతి రుతు పవనాలు బలపడ్డాయి. రానున్న 24 గంటల్లో ఈ రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావారణ శాఖ ప్రకటించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురిశాయి. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో వర్షం పడింది. గురు, శుక్ర వారాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో నగరంలో వాతావరణం చల్లగా మారింది. తెలంగాణలో పలుచోట్ల వర్షాలు పడ్డాయి. అత్యధికంగా ఆరుట్ల(రంగారెడ్డి జిల్లా)లో 4.5, గచ్చిబౌలి(హైదరాబాద్‌)లో 4.5, ఎర్రారం(నల్గొండ)లో 4.4, దండుమైలారం(రంగారెడ్డి)లో 3.8. మాదాపూర్‌లో 2.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక తెలంగాణపై 1500 మీటర్ల ఎత్తు వరకూ గాలుల విచ్ఛిన్నత ఏర్పడింది. వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

గురువారం కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, శుక్రవారం తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version