ఈటల రాజేందర్ వ్యవహారం అనేక మలుపులు తిరిగి చివరకు బీజేపీ గూటికి వెల్లింది. ఇప్పటికే ఆయన రాష్ట్ర బీజేపీ నేతలను కలిసి, అనంతరం ఢిల్లీకి వెళ్లారు. అక్కడ జేపీ నడ్డాను కలిసి పార్టీ పరమైన హామీ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఈటల రాకతో బీజేపీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయని తెలుస్తోంది.
ఈటల చేరికపై బీజేపీలో గ్రూపు రాజకీయాలకు తెరలేపినట్టయింది. బీజేపీలో సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న సీనియర్లకు చెప్పకుండా ఈటలను తీసుకురావడం కరెక్టు కాదని చాలామంది వాపోతున్నారు. ఈటల వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తి కాబట్టి బీజేపీలోకి వస్తే ఇమడలేడనేది కూడా మరికొందరి వాదన.
అయితే ఈటలను తీసుకురావడం వెనక పెద్ద రాజకీయమే ఉందని తెలుస్తోంది. నిజానికి ఈటలను బీజేపీలోకి తీసుకురావడం వెనుక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిదే ప్రధానపాత్ర అని అంతా చెప్పుకుంటున్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ పెరిగిపోతోంది. దీంతో ఆయనకు పగ్గాలు వేయాలనే ఈటలను తీసుకొస్తున్నట్టు చెబుతున్నారు. గతంలో డీకే అరుణ ప్రభావాన్ని తగ్గించేందుకే సినీనటి విజయశాంతిని కిషన్ రెడ్డి తీసుకొచ్చారని ఆరోపణలు కూడా ఉన్నాయి.