దేశవ్యాప్తంగా జనవరి 16వ తేదీన కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే తొలి రెండు దశల్లో టీకాలను సజావుగానే పంపిణీ చేశారు. కానీ మూడో దశకు వచ్చే సరికి టీకాల కొరత ఏర్పడింది. 18-44 ఏళ్ల వయస్సు ఉన్నవారికి టీకాలను ఇవ్వడం కుదరడం లేదు. అలాగని 45 ఏళ్లకు పైబడిన వారికి మొదటి డోసు ఇస్తున్నారా ? అంటే అదీ లేదు. కేవలం రెండో డోసు తీసుకోవాల్సిన వారికి మాత్రమే కొన్ని చోట్ల టీకాలను ఇస్తున్నారు. వాటికి కూడా ప్రస్తుతం కొరత ఏర్పడింది. దీంతో మొదటి డోసు తీసుకున్నవారు రెండో డోసు తీసుకునే సమయం వస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు.
కోవాగ్జిన్, కోవిషీల్డ్ రెండింటిలో ఏ టీకా తీసుకున్నా సరే రెండు డోసుల చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే కోవిడ్ టీకా సమర్థవంతంగా పనిచేస్తుంది. కోవాగ్జిన్‌కు ఒక్కో డోసుకు మధ్య 28 రోజుల విరామం ఇవ్వాలి. కోవిషీల్డ్ అయితే మొదటి డోసు తీసుకున్న తరువాత 4 నుంచి 8 వారాల్లోగా అంటే 2 నెలల్లోగా రెండో డోసును తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సమయం మించిపోతే ఎలా ? అప్పుడు ఏమవుతుంది ? మొదటి డోసు తీసుకున్నాక రెండో డోసుకు చాలా గ్యాప్ వస్తే ఎలా ? అంటే.. అందుకు వైద్య నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారంటే…
కోవాగ్జిన్, కోవిషీల్డ్.. ఏ టీకా అయినా సరే రెండో డోసుకు 3 నుంచి 6 నెలల వరకు విరామం అయితే ఓకే. పెద్దగా ఏమీ కాదు. కంగారు పడాల్సిన పనిలేదు. కానీ మొదటి డోసు తీసుకున్నాక రెండో డోసుకు 6 నెలలు దాటి ఇంకా ఎక్కువ సమయం పడితే అప్పుడు రెండో డోసు తీసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదు. మళ్లీ రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. కనుక అంత గ్యాప్ రాకుండా చూసుకోవాలి. లేదంటే టీకా రెండు డోసులను మళ్లీ తీసుకోవాల్సి ఉంటుంది.