అధికారం పరమావధి కాదని పేర్కొని ప్రజల కోసం నిలబడతానని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నిస్తానని పార్టీ పెట్టారు జనసేనాని పవన్ కల్యాణ్. ప్రజా శ్రేయస్సు కోసం పదవులు అక్కర్లేదని తెలిపారు. అయితే, ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన కనీసమాత్రంగా స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఏదేని విషయం కేవలం ఆయన పేరిటి ప్రెస్‌నీట్స్ రిలీజ్ అవుతున్నాయి తప్ప ఆయన గళం వినపడటం లేదని కొందరు అంటున్నారు. ఇకపోతే తెలంగాణలో కంటే కూడా ఏపీపైనే దృష్టి పెట్టారని భావించినా అక్కడ జరిగే పరిణామాలపైన కూడా స్పందన లేదు. ఏపీ ప్రయోజనాల కోసమే పోరాడతనానని చెప్పిన పవన్ సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీతో జతకట్టి మౌన ముద్రదాల్చారని పలు పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.
ఒకనాడు పాచిపోయి లడ్డు అని బీజేపీని విమర్శించిన పవన్ ఆ పార్టీతోనే జతకట్టడం తప్పేనని ఇప్పటికీ వాదించే వారున్నారు. అమరావతి రైతుల గురించి కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి కానీ కనీస మాత్రంగా నోరు మెదపడం లేదని విమర్శించే వారున్నారు. అయితే, ఈ సంగతులన్నీ పక్కనబెట్టి పవన్ ప్రస్తుతం సినిమాలపైనే దృష్టి సారించారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ హీరోగా వచ్చిన ‘వకీల్ సాబ్’ సూపర్ హిట్ కాగా, ప్రజెంట్ ఆయన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా జనసేనాని రూటే సెపరేటని, ఆయన అవసరం ఉన్నప్పుడు ప్రజా సమస్యల పట్ల తప్పక స్పందిస్తారని పవన్ అభిమానులు పేర్కొంటున్నారు. వరుస సినిమాలు చేస్తూ మధ్య మధ్యలో వీలు దొరొకినప్పుడల్లా పార్టీ బలోపేతానికి కావాల్సిన ప్రణాళికలు పవన్ కల్యాణ్ రచించుకుంటున్నారని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం.