కరోనాకు అడ్డుకట్ట వేయలేమా..? మార్చి 31 దాటితే పరిస్థితి ఏమిటి..?

-

ప్రపంచ వ్యాప్తంగా 145కి పైగా దేశాలకు విస్తరించిన కరోనా వైరస్‌ మన దేశంలోని ప్రజలనూ వణికిస్తోంది. ఇక్కడ ఇతర దేశాలంత తీవ్రతరం కాకపోయినా జనాలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు మార్చి 31వ తేదీ వరకు సినిమా హాళ్లు, స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, మాల్స్‌ను మూసివేయాలని నిర్ణయించాయి. ఇక విద్యార్థులకు జరగాల్సిన పరీక్షలు మాత్రం యథాతథంగా జరుగుతున్నాయి. అయితే కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు మార్చి 31వ తేదీ వరకు రాష్ట్రాలు ఓ రకంగా కర్ఫ్యూ లాంటి వాతావరణాన్ని సృష్టించినా.. ఆ తరువాతైనా పరిస్థితి మారుతుందా.. ఇంకా తీవ్రతరమవుతుందా..? అని అందరిలోనూ భయాందోళనలు నెలకొన్నాయి.

మన దేశంలో నిజానికి ఇతర దేశాలతో పోలిస్తే కరోనా తీవ్రత అంతగా లేదు. కానీ రానున్న రోజుల్లో భారత్‌కు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్‌ కేసులు మన దేశంలో రోజు రోజుకీ పెరుగుతుండడాన్ని చూస్తే.. ఇక్కడ ఆ వైరస్‌ తీవ్రతరం అయ్యేందుకు మరెంతో సమయం పట్టదని అనుకుంటున్నారు. అయితే పరిస్థితి అంత వరకు రాకుండా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని జాగ్రత్త చర్యలనూ తీసుకుంటున్నాయి. అయినప్పటికీ ఎప్పుడు ఏమవుతుందో తెలియని ఆందోళనకర పరిస్థితి నెలకొంది.

ఇక చైనాలో కరోనా వైరస్‌ విజృంభించిన పద్ధతిలోనే మన దేశంలోనూ విజృంభిస్తే పరిస్థితి ఏమిటని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముందు ముందు జరగబోయే పరిణామాలకు ప్రజలను సిద్ధం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ తయారయ్యేందుకు ఇంకా కొన్ని నెలల సమయం పట్టేందుకు అవకాశం ఉన్నందున.. ప్రభుత్వాలు విధించిన మార్చి 31వ తేదీ డెడ్‌లైన్‌ తరువాత పరిస్థితి ఎలా ఉంటుందోనని అందరూ భయపడుతున్నారు. ఈ క్రమంలో ఆ తేదీ దాటినా కరోనా ప్రభావం ఇంకా తగ్గకపోతే.. అప్పుడు ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటాయో చూడాలి. అయితే ప్రస్తుతం కరోనా మన దేశంలో తీవ్రతరంగా లేని నేపథ్యంలో ఇప్పుడే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని ఆ వైరస్‌కు అడ్డుకట్ట వేయాలని, లేదంటే పరిస్థితి చేయి దాటిపోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి పాలకులు ఏం చేస్తారో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version