ఆంధ్ర ప్రదేశ్ లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయా…? అంటే అవుననే సమాధానం వినబడుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన మద్దాలి గిరి, చీరాల నుంచి భారీ మెజారిటీతో గెలిచిన సీనియర్ నేత కరణం బలరాం, ముగ్గురు కలిసి ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు జై కొట్టారు. దీంతో టీడీపీకి షాక్ ఇచ్చినట్లు అయింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ముగ్గురు రాజీనామాలు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం తథ్యమని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తవక ముందే వాళ్ళ ముగ్గురు తమ తమ పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉందని, రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది. రాజీనామా చేయాలని మళ్లీ అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తానని జగన్ నుంచి స్పష్టమైన హామీ రావడంతో ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ముగ్గురు రాజీనామాకు సిద్ధమయ్యారు.
మళ్లీ గెలిస్తే ఖచ్చితంగా తన కేబినెట్ లోకి తీసుకుంటానని కరణం బలరాంకి జగన్ స్పష్టమైన హామీ ఇచ్చినట్టు సమాచారం. ఉగాది రోజు వాళ్ళ ముగ్గురు రాజీనామా చేస్తారని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. వాళ్ళతో చంద్రబాబు నాయుడు అసలు సంప్రదింపులు కూడా జరపలేదని అంటున్నారు. అయితే మరికొంతమంది ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత వారితో కూడా రాజీనామా చేయించే ఆలోచనలో ఉన్నారట ముఖ్యమంత్రి. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే మంత్రి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.