ఏం కేసీఆర్ సారు?.. నీ మనవడు కూడా కప్పల భోజనమే తింటున్నాడా?: విజయశాంతి

-

గురుకుల హాస్టల్స్ ని ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు బిజెపి నేత విజయశాంతి. గురుకుల హాస్టల్స్ లో విద్యార్థులకు ఉన్న వసతులు.. ఖైదీలకు ఇచ్చే వసతుల కన్నా హీనంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. తాజాగా నారాయణఖేడ్ జూకల్ శివారులోని సాంఘిక సంక్షేమ స్కూలులో శుక్రవారం మధ్యాహ్నం ఫుడ్ పాయిజన్ అయిన ఘటనపై రాములమ్మ స్పందిస్తూ..

“సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్స్‌ని కేసీఆర్ స‌ర్కార్ అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. విద్యార్థులకున్న వసతులు.. ఖైదీలకు ఇచ్చే వసతుల కన్నా హీనంగా ఉన్నాయి. ప్ర‌తి గురుకుల‌ంలోను నిర్ల‌క్ష్య‌మే తాండ‌వం చేస్తోంది. తాజాగా నారాయణ్ ఖేడ్ జూకల్ శివారులోని సాంఘిక సంక్షేమ స్కూల్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే స్టూడెంట్స్‌కి పాఠశాలలోనే ఎవరికీ తెలియకుండా చికిత్స అందించారు. గురువారం రాత్రి చేసిన పప్పునే శుక్రవారం కూడా పెట్టడంతో స్టూడెంట్లకు విరేచనాలు, కళ్లు తిరిగి పడిపోవడం వంటివి జరిగాయి.

వారికి మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నరు. ఇంత జ‌రుగుతున్నా అధికారులు మాత్రం ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణవ్యాప్తంగా ఎక్క‌డో ఒకచోట ఇలాంటి ఘ‌ట‌న‌లు త‌రచూ జ‌రుగుతూనే ఉన్నయి. ఏం కేసీఆర్ సారు?… మీ మనవడు కూడా కప్పల భోజనమే తింటున్నడా? ఇప్ప‌టికైనా ప్ర‌తి గురుకులానికీ స‌రైన వ‌స‌తులు క‌ల్పించాల‌ని బీజేపీ త‌రఫున డిమాండ్ చేస్తున్నం. బంగారం లాంటి విద్యార్థుల భ‌విష్య‌త్తుతో ఆడుకుంటున్న కేసీఆర్ స‌ర్కార్‌కు తెలంగాణ విద్యార్థి లోక‌ం త‌గిన శాస్తి చేయడం ఖాయం.” అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version