దసరా పండుగ ఎప్పుడు అనే విషయం ఇప్పుడు చర్చగా మారింది. 18వ తేదీన సూర్యోదయానికి నవమి తిథి తర్వాత మధ్యాహ్నం 1.44 నిమిషాలకు వస్తుంది. దీంతో పలువురికి రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా శుక్రవారం సూర్యోదయానికి దశమి తిథి ఉంది కాబట్టి పండుగ 19వ తేదీ అని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రతి పండుగ నిర్ణయానికి ఒక శాస్త్రం ఉంటుంది. సనాతన ధర్మం అంటే వేదం ఏం చెప్పిందనే దాని ప్రకారం పండుగలను జరుపుకోవాలి. దశమి తిథి ఎప్పుడు వచ్చిందనేది ముఖ్యం కాదు. దసరా పండుగకు ప్రమాణం విజయమూహూర్తం. రోజును కొన్ని ముహూర్తాలుగా విభజిస్తారు. సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు ఇలా ఉండే మూహూర్తం ఆధారంగా కొన్ని పండుగలను నిర్ణయిస్తారు.
సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఉండే ముహూర్తమే విజయ మూహూర్తం. ఈ సమయంలో దశమి తిథి ఉంటేనే విజయదశమిగా పరిగణించాలని శాస్త్రం చెప్పుతుంది. శాస్త్ర ప్రమాణం ప్రకారం గురువారం (18వ తేదీ) సాయంత్రం సూర్యాస్తమయానికి దశమి తిథి ఉన్నది కాబట్టి గురువారమే విజయదశమి. ఈ ముహూర్త సమయంలో జయావిజయా సమేత అపరాజితను అర్చించడం విశేషమైనదిగా చెప్పుకోవచ్చు. విజయదశమి విశిష్టత రామాయణ, భారతాల్లో కూడా స్పష్టంగా ఉంది. గురువారం సాయంత్రం దశమి వేడుకులను జరుపుకొని ఏడాదంతా ఆనందంతో విజయాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ.. సర్వేజన సుఖినోభవంతు.
-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ