ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాలను దూకుడుగా అమలు చేస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవరత్నాలలో కీలకంగా భావించే అమ్మ ఒడి విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ పథకం అమలు కోసం ఇప్పటికే అన్ని రూపాలలోను నిధులు సేకరించే పనిలో పడిన రాష్ట్ర ప్రభుత్వం అమలు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. అంత వరకు బాగుంది గాని అసలు అమ్మ ఒడి లబ్ది దారులు ఎవరూ అనేది తెలియడం లేదు.
వాస్తవానికి ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీ ఏంటి అంటే… పిల్లలను బడికి పంపిస్తే ప్రతీ ఏటా 15 వేల రూపాయలు ఇస్తామని చెప్పారు. షరతులు వర్తిస్తాయి అన్నట్టు గా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముందు ప్రభుత్వ స్కూల్స్ కి మాత్రమే అని తర్వాత అన్ని స్కూల్స్ కి అని తర్వాత ఎంత మంది పిల్లలు ఉన్నా సరే 15 వేలు తల్లికి ఇస్తామని రోజుకో వ్యాఖ్య వినపడుతుంది.
ఇప్పుడు కొన్ని వినపడుతున్నాయి… కరెంటు మీటర్ 300 యూనిట్లు దాటితే… ఆ కుటుంబం పేరును లబ్దిదారుల జాబితా నుంచీ తొలగిస్తున్నారని సమాచారం. అలాగే కుటుంబంలో ఎవరికైనా ఫీజు రీయింబర్స్‌మెంట్ జరిగితే కూడా ఈ స్కీం వర్తించదట. అలాగే… గ్రామాల్లో నెలకు రూ.10వేలు, పట్టణాల్లో నెలకు రూ.12వేలకు మించి వేతనం ఉన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పిల్లలు ఈ స్కీంకి అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లబ్ది దారుల ఎంపిక ఆదివారంతో పూర్తవుతుంది. దీనితో అందరిలోనూ టెన్షన్ నెలకొంది. చిత్తూరు జిల్లాలో ఈ నెల 9 న ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు.