– భారత పటాన్ని వక్రీకరించిన డబ్ల్యూహెచ్‌వో
– భారతీయుల ఆగ్రహం… వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్
న్యూఢిల్లీః కరోనా మహమ్మారిపై ముందస్తు అప్రమత్తత, ప్రపంచదేశాలను జాగృతం చేయాల్సిన విషయంలో ఫెయిలయిందంటూ ఇప్పటికే అనేక విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజాగా మరో వివాదానికి తెరలేపింది. ఏకంగా భారత పటాన్ని వక్రీకరించడం ద్వారా మరో భారీ వివాదాన్ని రేపుతోంది.
డబ్ల్యూహెచ్‌వో తన వెబ్‌సైట్‌లో ప్రచురించిన మ్యాప్‌లో జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను భారత్ నుంచి వేరుగా చూపిస్తూ.. వేరు వేరు రంగుల్లో ప్రచురించింది. కొత్తగా ఏర్పడిన ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు బుడిద రంగులో ఉన్నాయి. మిగతా ఇండియా మ్యాప్ నేవీ బ్లూ రంగులో కనిపిస్తోంది. మరో వివాదాస్పద సరిహద్దు ప్రాంతమైన అక్సాయ్ చిన్‌ను నీలి చారలతో బూడిద రంగులో చైనాలో భాగంగా కనిపిస్తున్నట్టుగా ఉంది. కరోనా కేసులను పేర్కొనే డాష్‌బోర్డు నేపథ్యంలో ఇటీవల ఈ మ్యాప్‌ను ప్రచురించింది. దీనిన లండన్‌కు చెందిన దీపక్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో గుర్తించాడు. దీనిపై భారతీయులతో పాటు ఇతర దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ.. డబ్ల్యూహెచ్‌వో మ్యాప్‌ను మార్చలేదు. ఐక్యరాజ్య సమితి మార్గదర్శకాలను పాటిస్తూ ప్రచురించామని పేర్కొనడం గమనార్హం.
కాగా, డబ్ల్యూహెచ్‌వో తీరుపై భారత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత సార్వభౌమత్వాన్ని విస్మరిస్తూ పటాన్ని ప్రచురించటం పట్ల నిరసన తెలుపుతూ.. లండన్‌లో ఎన్ఆర్ఐ సంఘాలు ఆందోళనలు చేశాయి. కరోనా సంక్షోభంలో ఇతర దేశాలకు తనవంతు సాయం అందిస్తున్న భారత్‌ను అభినందించాల్సిందిపోయి ఈ విధంగా డబ్ల్యూహెచ్‌వో ప్రవర్తించడం అనైతికమనీ, అంతర్జాతీయ సంస్థగా ఉండే హక్కును కోల్పోయిందని విమర్శలు గుప్పిస్తున్నారు. డబ్ల్యూహెచ్‌వో వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఇటీవల ట్విట్టర్ సైతం భారత మ్యాప్ విషయంలో ఇలాంటి తప్పిదమే చేస్తే.. ప్రభుత్వం గట్టి హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, డబ్ల్యూహెచ్‌వో ఇలా చేయడం వెనుక చైనా హస్తం కూడా ఉండి ఉంటుందని ఆరోపణలు సైతం వస్తున్నాయి.