భారతీయ రైళ్లలో ప్రయాణికుల సౌకర్యానికి అనుగుణంగా భిన్న సదుపాయాలు ఉన్న రైళ్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని రైళ్లలో కేవలం జనరల్ బోగీలు మాత్రమే ఉంటాయి. కొన్నింటిలో జనరల్, ఏసీ, స్లీపర్ ఇలా కలిపి ఉంటాయి. ఇక కొన్ని రైళ్లలో కేవలం ఏసీ బోగీలు మాత్రమే ఉంటాయి. ఈ క్రమంలో రైలు ప్రయాణికులు తమ స్థోమత, ఇష్టాలకు అనుగుణంగా ఆయా రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. అయితే జనరల్, స్లీపర్, ఏసీ బోగీలు అన్నీ కలిపి ఉన్న రైళ్లలో ఏసీ బోగీలు మాత్రం రైలు మధ్యలో ఉంటాయి. అవును. దీన్ని చాలా మంది గమనించే ఉంటారు. అయితే ఏసీ బోగీలను అలా రైలు మధ్యలో ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా రైల్వే స్టేషన్లలో రైలు దిగాక ప్రధాన ద్వారం స్టేషన్ మధ్యలో ఉంటుంది. రైలు ప్లాట్‌ఫాంపై ఆగగానే అందులోంచి దిగి నేరుగా ఎదురుగా ఉండే ప్రధాన ద్వారం గుండా ప్రయాణికులు బయటకు వెళ్తారు. అయితే ఏసీ బోగీల్లో చార్జిలు ఎక్కువగా ఉంటాయి. సదుపాయాలు కూడా ఎక్కువగానే లభిస్తాయి. అందువల్ల ఆ తరగతులకు చెందిన ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండడం కోసం ఏసీ బోగీలను రైలు మధ్యలో ఏర్పాటు చేస్తారు. దీంతో రైలు ప్లాట్‌ఫాం మీద ఆగగానే వారు వేగంగా స్టేషన్ బయటకు వెళ్లవచ్చు. వారు ఏసీల్లో ప్రయాణించడం వల్ల లభించే సదుపాయం ఇది. వారి కోసమే అలా బోగీలను రైలు మధ్యలో ఏర్పాటు చేయడం మొదలు పెట్టారు.
ఇక సాధారణంగా జనరల్, స్లీపర్ బోగీలు రైలుకు రెండు చివర్లలో ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ శాతం మంది ప్రయాణికులు స్టేషన్ ప్రధాన ద్వారం వద్దే ఉంటారు. రైలు ఆగగానే ఎక్కేందుకు యత్నిస్తారు. బోగీలు మధ్యలో ఉంటే కొన్ని స్టేషన్లు ఆగే సరికి రైలు కిక్కిరిసి పోతుంది. అదే సమయంలో ముందు, చివర్లలో ఉండే బోగీలు ఖాళీగా ఉంటాయి. వాటిల్లో ఎక్కరు. ఎందుకంటే ముందుకు గానీ, వెనకకు గానీ చాలా దూరం నడవాలి. కనుక మధ్యలో రైలు ఎక్కేందుకు యత్నిస్తారు. ఇది ఆయా బోగీల్లో ప్రయాణికుల సంఖ్యను పెంచుతుంది. దీని వల్ల ఆయా బోగీల్లో ప్రయాణించే వారు ఇబ్బందులు పడతారు. అలా జరగకుండా ఉండేందుకే జనరల్, స్లీపర్ క్లాస్ బోగీలను రైళ్లకు ముందు, చివర్లలో ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలో ఏసీ బోగీలు మధ్యలో ఉంటాయి. ఇవీ.. ఈ విషయం వెనుక ఉన్న అసలు కారణాలు..!