చంద్రుడు అంటే మన మనస్సు, శరీరంపై అద్భుతమైన ప్రభావం చూపగల శక్తి. అమావాస్య (చంద్రుడు పూర్తిగా కనబడని రోజు) పౌర్ణమి (నిండు చంద్రుడు వెలిగే రోజు) కేవలం ఖగోళ సంఘటనలు మాత్రమే కాదు. హిందూ సంప్రదాయంలో ఈ తిథులు అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంటాయి. అందుకే ఈ రోజుల్లో కొన్ని ప్రత్యేక ఆచారాలను తప్పక పాటిస్తారు. ఆ ప్రాముఖ్యత, ఆచారాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో చూద్దాం..
పౌర్ణమి నిండు వెన్నెల, ఆధ్యాత్మిక సంపూర్ణత: పౌర్ణమి రోజున చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా, సంపూర్ణ శక్తితో ఉంటాడని నమ్మకం. ఈ రోజున సముద్రంలో పోటు అధికంగా ఉన్నట్టే, మన శరీరంలో ఉండే ద్రవాలు, ముఖ్యంగా మనస్సుపై కూడా చంద్రకాంతి ప్రభావం అధికంగా ఉంటుంది. అందుకే పౌర్ణమి రోజును దేవతారాధనకు, ఆధ్యాత్మిక అభ్యాసానికి (Spiritual Practices) అత్యుత్తమంగా భావిస్తారు.
సత్యనారాయణ వ్రతం: అనేక మంది పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు. ఇది ఇంట్లో సుఖసంతోషాలు సంపద కలగడానికి చేస్తారు.
దేవాలయ దర్శనం: ఈ రోజున ఆలయాలలో ప్రత్యేక పూజలు, దీపాలంకరణ చేస్తారు. నిండు చంద్రుని సాక్షిగా ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్మకం.
ఉపవాసం : చాలా మంది ఈ రోజున ఉపవాసం పాటిస్తారు. ఈ ఉపవాసం మనస్సును, శరీరాన్ని శుద్ధి చేయడానికి, చంద్రుని సానుకూల శక్తిని స్వీకరించడానికి సహాయపడుతుంది.

అమావాస్య రోజున చంద్రుడు కనిపించడు. ఈ చీకటి రోజును సాధారణంగా అశుభంగా భావించినా, దీనికి ఆధ్యాత్మికంగా చాలా లోతైన అర్థం ఉంది. ఇది పూర్తయిన చక్రానికి, కొత్త ఆరంభానికి సంకేతం. హిందూ సంప్రదాయంలో అమావాస్యను ముఖ్యంగా పితృ దేవతల ఆరాధనకు కేటాయించారు.
పిండ ప్రదానం/తర్పణం: పితృ దేవతలకు శాంతి కలగడం కోసం, వారికి లోకాలు దాటే మార్గంలో సహాయం చేయడం కోసం ఈ రోజున తర్పణాలు, పిండ ప్రదానాలు చేస్తారు. ఇది వారి ఆశీస్సులు పొందడానికి ముఖ్యమైనదిగా భావిస్తారు.
దీపారాధన: అమావాస్య చీకటిని తొలగించడానికి ఇంట్లో, ఆలయాల్లో ఎక్కువ దీపాలు వెలిగిస్తారు. లక్ష్మీదేవి పూజ (దీపావళి అమావాస్య) లాంటివి చేస్తారు, తద్వారా అజ్ఞానాన్ని, పేదరికాన్ని దూరం చేస్తామని నమ్ముతారు.
నదీ స్నానాలు: పవిత్ర నదులలో పుణ్య స్నానాలు ఆచరించడం వల్ల పాపాలు తొలగిపోతాయని, పూర్వీకులకు మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు.
అమావాస్య, పౌర్ణమి కూడ ఈ రెండు తిథులు ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకమైనవి అయినప్పటికీ, హిందూ ధర్మంలో రెండూ సమతుల్యతకు, జీవిత చక్రానికి సంకేతాలు. నిండు వెలుగు పౌర్ణమి అయితే, సంపూర్ణ చీకటి అమావాస్య. ఈ శక్తివంతమైన రోజుల్లో ప్రకృతితో మమేకమై, పవిత్ర ఆచారాలను పాటించడం ద్వారా, మనం కేవలం ఆధ్యాత్మికతను మాత్రమే కాదు, మన మనస్సు, శరీరంపై సానుకూల ప్రభావాన్ని కూడా పొందుతున్నాము. మన సంప్రదాయంలో ప్రతి ఆచారం వెనుక ఒక గొప్ప సైన్స్ ఉంది.
