ట్రంప్‌ స్పూర్తితోనే బర్మా సైన్యం బరి తెగించిందా ?

-

పొరుగు దేశం మయన్మార్ లో ఫిబ్రవరి ఒకటవ తేదీన తిరుగుబాటు చేసిన సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. నవంబరు ఎనిమిదిన జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, నూతన పార్లమెంట్‌ ను ఏర్పాటు చేయవద్దని చేసిన హెచ్చరికలను ఖాతరు చేయలేనందుకు ఏడాది పాటు అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు చెప్పుకుంది. ఏడాది తరువాత ఎన్నికలు జరుపుతామనీ, విజేతలకు అధికారాన్ని అప్పగిస్తామంటోంది. ట్రంప్‌ స్పూర్తితోనే బర్మా సైన్యం ఇలా బరి తెగించిందా అన్న దానిపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది.

సైన్యం చేతిలోకి అధికారం రాగానే అధికార పార్టీ ఎన్ఎల్‌ డీ నేత, ప్రధాని పదవితో సమానమైన రాజ్యకౌన్సిలర్గా ఉన్న అంగ్‌ సాన్‌ సూచి, అధ్యక్షుడు యు విన్ మైయింట్ తదితరులను అరెస్టు చేశారు. సెల్‌ ఫోన్‌ లు , ఇంటర్నెట్ పనిచేయటం మానేశాయి. సాధారణ జనజీవితం సాఫీగానే సాగుతున్నట్లు వార్తలు వస్తున్నా, అసలు అక్కడేం జరుగుతోందో బయటి ప్రపంచానికి పూర్తిగా తెలియని పరిస్థితి ఏర్పడింది.

నిజానికి మయన్మార్ పరిణామాల గురించి చాలా వాదనలు వినిపిస్తున్నాయి. అమెరికా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ట్రంప్ బైడెన్ విజయాన్ని గుర్తించ లేదు. అదే సమయంలో బైడెన్ విజయాన్ని ఖరారు చేసే పార్లమెంట్ సమావేశం మీద జనవరి ఆరున తన మద్దతుదారులతో దాడికి కూడా కారణమయ్యారు. అదే స్ఫూర్తితో మయన్మార్ మిలిటరీ కూడా సరిగ్గా కొత్త పార్లమెంట్ తొలి సమావేశమై పదవీ బాధ్యతలు చేపట్టే రోజునే తిరుగుబాటు చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ, తమ చర్యకు ఎన్నికల అక్రమాలే కారణమని మిలిటరీ సమర్థించుకుంటోంది.

నవంబరు ఎనిమిదిన జరిగిన ఎన్నికల్లో ప్రజా ప్రతినిధుల సభలో 440లో 315, జాతులకు ప్రాతినిధ్యం వహించే ఎగువ సభలోని 224లో 161స్ధానాలకు ఎన్నికలు జరిగాయి. అత్యధిక స్దానాలను ఎన్ఎల్డి సాధించింది. ప్రజాప్రతినిధుల సభలో 258, జాతుల సభలో 138 సీట్లు పొంది పూర్తి మెజారిటీని సాధించింది. అయితే, మిలిటరీ మద్దతు ఉన్న డెవలప్మెంట్ పార్టీకి 26, 7 స్థానాలు మాత్రమే వచ్చాయి. మయన్మార్ లో మిలిటరీ ఆధిపత్యం చరిత్ర ఇప్పటిది కాదు.. ఇప్పుడు కూడా అక్కడ జాతీయ, రాష్ట్రాల చట్ట సభల్లో మూడోవంతు సీట్లు మిలిటరీ చేతిలోనే ఉంటాయి. ప్రభుత్వంలో రక్షణ, సరిహద్దులు, హౌం శాఖ మంత్రులన్ని కూడా మిలిటరీనే నియమిస్తుంది.

మరోపక్క మయన్మార్ సమస్యపై ప్రపంచ దేశాల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తక్షణమే మిలిటరీ తన అధికారాన్ని వదులుకోవాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ డిమాండ్ చేశారు. లేనట్లయితే తీవ్రమైన ఆంక్షలను విధిస్తామని హెచ్చరించారు. బయటి జోక్యం లేకుండా మయన్మార్ తన సమస్యను పరిష్కరించుకోగలదని చైనా అంటోంది. సరిహద్దుతో పాటు వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న మయన్మార్ పరిణామాలు చైనాకు కీలకమని చెప్పాలి. మరోపక్క మయన్మార్లో జరిగిన పరిణామాలకు చైనా మద్దతు ఉందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version