కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న వధూవరుల తొలి అడుగు ఎంతటి ముఖ్యమైనదో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా భారతీయ సంప్రదాయంలో అగ్నిసాక్షిగా ఒక్కటైన జంట కొన్ని నిర్దిష్ట ఆచారాలను పాటిస్తుంది. ప్రతి ఆచారానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏ శుభకార్యానికైనా కొత్త ప్రదేశంలోకి ప్రవేశించడానికైనా ముందుగా కుడికాలు పెట్టాలని పెద్దలు సూచిస్తారు. అయితే ఈ సాంప్రదాయం వెనుక దాగి ఉన్న కారణాలు శుభసూచకాలు ఏమిటో తెలుసుకుందాం ..
సాధారణంగా మన సంస్కృతిలో కుడివైపు అనేది శుభాన్ని సానుకూలతను అదృష్టాన్ని సూచిస్తుంది. అందుకే ఏ పని మొదలుపెట్టినా, ఆలయ ప్రవేశం చేసినా కుడికాలు ముందు పెడతాం. నూతన దంపతులు తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తున్నప్పుడు, వారి ప్రయాణం అంతా మంచితో సౌభాగ్యంతో నిండి ఉండాలని కోరుకుంటారు. ఈ శుభాకాంక్షలకు ప్రతీకగా కుడికాలు ముందుగా పెట్టే ఆచారం ఉంది.

ఈ ఆచారానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఘట్టం వధువు గృహ ప్రవేశం. వివాహం తర్వాత, వధువు తన అత్తవారింటిలోకి మొదటిసారి అడుగుపెట్టేటప్పుడు కుడికాలు ముందుగా పెట్టడం శుభ సూచకంగా భావిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం, నవ వధువును ఐశ్వర్య దేవత లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారు. కుడికాలుతో ఆమె ఇంట్లోకి అడుగుపెట్టడం అంటే ఆ ఇంట సిరిసంపదలు శ్రేయస్సు అంతులేని సంతోషం అడుగుపెట్టాయని అర్థం.
కుడికాలుతో పాటు కొన్ని సంప్రదాయాలలో వధువు ఇంటి గుమ్మం వద్ద ఉంచిన బియ్యం నిండిన కలశాన్ని లేదా పాత్రను నెమ్మదిగా కాలితో తట్టడం కూడా జరుగుతుంది. బియ్యం సమృద్ధికి చిహ్నం. ఆ బియ్యం ఇంట్లోకి పడటం వలన, వారి కొత్త జీవితంలో ఎప్పుడూ ధనధాన్యాలకు, ఆనందానికి కొరత ఉండదని నమ్మకం. ఈ విధంగా కుడికాలుతో మొదలయ్యే ప్రతి అడుగు కొత్త బంధం శక్తివంతంగా సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తుంది.
కుడికాలు ముందుగా పెట్టే సంప్రదాయం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, ఇది శ్రేయస్సు, సానుకూలత పట్ల మనకున్న విశ్వాసానికి ప్రతీక. నూతన దంపతులు తమ కొత్త ప్రయాణాన్ని కుడికాలితో ప్రారంభించడం వారి దాంపత్య జీవితం శుభప్రదం ఆనందమయం కావాలని కోరుకునే ఒక మాధుర్యమైన సంకల్పం.