సిబిఐ దర్యాప్తులపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకున్న కల్వకుంట్ల కుటుంబం ఎక్కడ దాక్కున్నా బయటకు తీసుకొస్తామని హెచ్చరించారు. తప్పు చేయని సీఎం కేసీఆర్ సీబీఐ కి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో సీబీఐ జోక్యం ఉండకూడదు అని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 31 తేదీన జీవో 51 ని తీసుకువచ్చారని.. ఈ జీవోని బహిర్గతం చేయకుండా దాచిపెట్టడం దుర్మార్గమని మండిపడ్డారుు. మీరు రాష్ట్రాన్ని దోచుకోకపోతే, ధరణి పేరుతో భూములను కబ్జా చేయకపోతే సిబిఐ అంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అందుకే తమను ఈడి, మోడీ, బోడి ఏమి చేయలేరని మంత్రి కేటీఆర్ అనడం వెనుక ఇది అసలు రహస్యమని అన్నారు డీకే అరుణ. చండూరులో నిర్వహించే నేటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.