కార్తీక మాసం అంటే శివకేశవుల అనుగ్రహం కోసం భక్తులు పరితపించే పవిత్ర మాసం. ఈ మాసంలో చేసే ప్రతి పూజ, ప్రతి దానం ఎంతో పుణ్యాన్నిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ మాసంలో అత్యంత ముఖ్యమైన ఆచారం ఒకటుంది. అదే ‘కార్తీక స్నానం’ నదీ తీరాల్లో చెరువుల్లో తెల్లవారుజామునే భక్తితో చేసే ఈ స్నానం వెనుక ఉన్న మహత్తర శక్తి ఏంటి? పురాణాలు దీని గురించి ఏం చెబుతున్నాయో తెలుసుకుంటే, ఆశ్చర్యపోతారు.
కార్తీక స్నానం ఎందుకు ప్రత్యేకం?: సాధారణ స్నానం దేహాన్ని శుభ్రం చేస్తే కార్తీక స్నానం ఆత్మను పవిత్రం చేస్తుందని హిందూ ధర్మం విశ్వసిస్తుంది. పురాణాల ప్రకారం, ఈ మాసంలో సూర్యోదయానికి ముందే పవిత్ర నదులలో (గంగ, గోదావరి, కృష్ణ వంటి) స్నానం చేస్తే గత జన్మల్లో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి.
కార్తీక మాసంలో శ్రీమహావిష్ణువు ‘క్షీరసాగరంలో’ యోగనిద్ర నుంచి మేల్కొనే సమయం కాబట్టి ఈ మాసంలో చేసే ప్రతి మంచి పనికి అపారమైన ఫలం లభిస్తుంది. ముఖ్యంగా ‘త్రిమూర్తులు’ (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు) ఈ మాసంలో నదీ జలాలలో కొలువై ఉంటారని నమ్మకం. అందుకే కార్తీక స్నానం ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక శక్తిని కూడా ప్రసాదిస్తుంది.

పురాణాల్లో చెప్పిన మాహాత్మ్యం: కార్తీక స్నానం విశిష్టత గురించి పద్మ పురాణం, స్కంద పురాణం వంటి గ్రంథాలలో వివరంగా చెప్పబడింది. ‘బ్రహ్మదేవుడు’ కార్తీక స్నాన మహిమ గురించి ప్రస్తావించాడని చెబుతారు. కార్తీక మాసంలో పవిత్ర నదిలో స్నానం చేసి, సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చి, దీపం వెలిగిస్తే.. ఆ వ్యక్తికి అన్ని తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యం దక్కుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అంతేకాక ఈ స్నానం చేయడం వల్ల ఐశ్వర్యం, ఆరోగ్యం, దీర్ఘాయుష్షు లభిస్తాయని, సంతాన భాగ్యం లేని వారికి సంతానం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. ఉపవాసం దీపారాధనతో పాటు ఈ స్నానం ఆచరిస్తే, శివకేశవుల అనుగ్రహం తప్పక లభిస్తుంది.
కార్తీక స్నానం కేవలం ఒక ఆచారం కాదు, అది మన సంస్కృతి, మన విశ్వాసం. ప్రకృతితో మమేకమై భగవంతుడికి దగ్గరయ్యే అద్భుత అవకాశం. భక్తితో, శ్రద్ధతో ఈ ఆచారాన్ని పాటిస్తే, ఆ కార్తీక మాసం ఇచ్చే శుభఫలితాలను తప్పక పొందవచ్చు.
ఆరోగ్యం సహకరించనివారు లేదా నదీస్నానానికి అవకాశం లేనివారు తమ ఇంటి వద్దనే గోరువెచ్చని నీటిలో కొద్దిగా గంగాజలం లేదా తులసి దళాలు వేసుకుని ‘గంగా, గోదావరి, కృష్ణ నమః’ అని ప్రార్థించి స్నానం చేసినా శుభఫలితం లభిస్తుంది.
