ఏపీ – తెలంగాణ మళ్లీ ఒకటి కావాలన్న ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జగన్, కెసిఆర్ ఆడుతున్న నాటకంలో భాగంగానే సమైక్య రాష్ట్ర నినాదాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చారని ఆరోపించారు.
నేడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకురాలు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రమాద బీమా చెక్కుల పంపిణీ, పేదలకు బట్టలు పంపిణీ చేశారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కు తెలంగాణతో పేరు బంధం తెగిపోయిందని అన్నారు. బిజెపికి సహకరించడానికే బిఆర్ఎస్ ఏర్పాటు చేశారని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడమే బిఆర్ఎస్ లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శించారు.
కేసు విచారణకు వచ్చే ముందే ఎన్నికల కమిషన్ టిఆర్ఎస్ పేరుని బిఆర్ఎస్ గా మార్చేశారన్నారు. బిజెపి సూచనలతోనే ఎన్నికల కమిషన్.. టిఆర్ఎస్ కి సహకరించిందన్నారు రేవంత్ రెడ్డి. కోర్టు ధిక్కరణకి పాల్పడ్డ కేంద్ర ఎన్నికల కమిషన్ పై లీగల్ గా ఫైట్ చేస్తామన్నారు.