రాష్ట్రంలో ఓ వైపు ప్రజలు కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం సచివాలయాన్ని అర్జెంటుగా కూల్చివేస్తుందని.. అంత అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చిందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబులు ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేవారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొండిగా వ్యవహరిస్తున్నారని, ఆయనకు ప్రజల బాధలు పట్టడం లేదని ఆరోపించారు.
కరోనాతో రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిందని వారన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం ఇబ్బందిగా మారిందని, అలాగే రైతులకు రుణమాఫీ డబ్బులు ఇవ్వడం లేదని.. ఈ నేపథ్యంలో కొత్త సచివాలయాన్ని అంత అర్జెంటుగా నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే.. మరోవైపు సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష చేయడం లేదని, ఎక్కడో చీకట్లో ఉన్నారని విమర్శించారు. సీఎం దేనికి ప్రాధాన్యతనిస్తున్నారో ప్రజలు గమనించాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు ప్రశ్నించాలని అన్నారు.
పాత సచివాలయంలో కరోనా ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని తాము కోరినా.. వినకుండా సీఎం మొండిగా వ్యవహరిస్తూ దాన్ని కూల్చివేయించారని అన్నారు. అందులో కనీసం 10వేల మందికి చికిత్స అందించే అవకాశం ఉండేదని అన్నారు. సీఎం కేసీఆర్ మొదట్నుంచీ కరోనాపై తప్పుడు విధానాలను అనుసరిస్తున్నారని అన్నారు. ఆయన వైఖరి వల్ల కరోనాతో జనాల ప్రాణాలు పోతున్నాయని అన్నారు. సీఎం మొండి వైఖరి వల్లే రాష్ట్రంలో ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఇకనైనా కేసీఆర్ ప్రజా సంక్షేమంపై దృష్టి నిలపాలని అన్నారు.