అవును! ఇప్పుడు ఈ మాటే.. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వినిపిస్తోంది. కుప్పం నియోజకవర్గంలో వైసీపీకి ప్రత్యేక పొజిషన్ ఉంది. ఇక్కడ టీడీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను ఓడించాలనేది వైసీపీ వ్యూహం. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో చంద్రమౌళి అనే రిటైర్డ్ ఐఏఎస్‌కు వైసీపీ అధినేత జగన్ టికెట్ ఇచ్చారు. ఆయన కూడా బాగానే పనిచేశారు. చంద్రబాబుకు దీటుగా ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే గత ఏడాది ఎన్నికల్లో చంద్రబాబుకు ఇప్పటి వరకు లేని షాక్ తగిలింది. మెజారిటీ తగ్గుముఖం పట్టడం గమనార్హం. చంద్రబాబు గెలిచినా.. మెజారిటీ తగ్గడంతో వైసీపీకి ఆశలు మరింతగా పెరిగాయి. వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితిలోనూ ఇక్కడ పాగా వేసేందుకు అవకాశం ఉందని పార్టీ నేతలు భావించారు.
ఈ క్రమంలోనే కుప్పంను మినీ మునిసిపాలిటీగా ప్రకటించారు ఇంత వరకు బాగానే ఉన్నా. చంద్రమౌళి ఆకస్మిక మరణంతో ఇక్కడ వైసీపీ తరఫున ఆయన కుమారుడు భరత్ కు ఇంచార్జ్ పోస్టు ఇచ్చారు. అయితే, రాజకీయాలకు కొత్త కావడంతో భరత్‌ను డామినేట్ చేసేలా వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. నిజానికి కుప్పంలో రాజకీయాలను చక్కబెట్టేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. అదేసమయంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా ఇక్కడ రాజకీయాలను వైసీపీకి అ నుకూలంగా మారుస్తున్నారు.
అయితే. అనూహ్యంగా ఇక్కడ రాజకీయాల్లో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప వేలు పెడుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. తన పరిధిలోని మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల కంటే కుప్పానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మరి దీని వెనుక రీజనేమైనాఉందా ? అనేది వైసీపీ నేతల మధ్య జరుగుతున్న చర్చ. తమకు అనుకూలమైన నాయకుడికి ఈ టికెట్ ఇప్పించుకునేందుకు ముందుగానే ప్లాన్ చేసుకున్నా రా? అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ప్రతి విషయాన్నీ రెడ్డప్పే దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు.
కార్యక్రమం చిన్నదైనా.. పెద్దదైనా.. కూడా ఆయనే అన్నీ నిర్వహిస్తున్నారట. దీంతో నాయకులు కూడా అసలు రెడ్డప్పకు ఏమైంది. నిత్యం ఇక్కడే ఉంటున్నారు. ఇంకే నియోజకవర్గం కూడా లేదా? అని చర్చించుకుంటున్నారు. ఇదిలావుంటే.. మరోవైపు పెద్ది రెడ్డి ఆలోచనల నేపథ్యంలోనే రెడ్డప్ప ఇక్కడ చక్రం తిప్పుతున్నారని అంటున్నారు. ఏదేమైనా… కుప్పంలో ఆ వైసీపీ నేతకు అంత మోజేంటో!! అనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం.