మీ కాళ్లు తరచుగా చల్లగా అనిపిస్తున్నాయా? పడుకునేటప్పుడు లేదా మామూలుగా కూర్చున్నప్పుడు కూడా కాళ్లల్లో వేడి తక్కువగా ఉందా? చాలామంది దీనిని వాతావరణ మార్పుగా లేదా సాధారణ విషయంగా కొట్టిపారేస్తారు. కానీ మన శరీరం ప్రతి చిన్న లక్షణం ద్వారా ఏదో ఒక ముఖ్యమైన విషయాన్ని మనకు చెబుతూ ఉంటుంది. మరి కాళ్లు చల్లబడటం అనేది కేవలం చలి ప్రభావమా లేక అంతర్గతంగా ఏదైనా ఆరోగ్య సమస్యకు సంకేతమా? ఈ విషయంలో మీ శరీరం ఏం చెబుతుందో తెలుసుకుందాం.
సాధారణంగా కాళ్లు చల్లబడటానికి అత్యంత సాధారణ కారణం శరీర ఉష్ణోగ్రత నియంత్రణ. చలి వాతావరణంలో ఉన్నప్పుడు, మెదడు కీలక అవయవాలైన గుండె, ఊపిరితిత్తులు మరియు మెదడుకు వేడిని సరఫరా చేయడానికి చేతులు, కాళ్ల వంటి అంగాలకు రక్తం ప్రసరణను తగ్గిస్తుంది. దీనివల్ల కాళ్లు చల్లగా మారతాయి.
అయితే, వాతావరణం వెచ్చగా ఉన్నా కూడా తరచుగా కాళ్లు చల్లగా అనిపిస్తే అది మీ శరీరం లోపల రక్తం ప్రసరణలో సమస్య ఉందని చెప్పే సంకేతం కావచ్చు. ముఖ్యంగా పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు కాళ్లకు సరైన మొత్తంలో రక్తం చేరక చల్లగా అవుతాయి. ఈ సమస్య అనేది రక్త నాళాలు ఇరుకుగా మారడం వల్ల ఏర్పడుతుంది.

కాళ్లు చల్లబడటానికి కేవలం రక్తం ప్రసరణ మాత్రమే కాదు ఇతర అంతర్గత కారణాలు కూడా ఉండవచ్చు. వాటిలో ముఖ్యమైనది అయోడిన్ లోపం లేదా థైరాయిడ్ సమస్య. థైరాయిడ్ గ్రంధి శరీరంలో శక్తి వినియోగాన్ని మరియు ఉష్ణోగ్రత నియంత్రణను నిర్వహిస్తుంది. థైరాయిడ్ పనితీరు మందగిస్తే జీవక్రియ రేటు తగ్గి, శరీరంలో తగినంత వేడి ఉత్పత్తి కాదు ఫలితంగా కాళ్లు, చేతులు చల్లబడతాయి.
అలాగే, నరాల నష్టం లేదా పెరిఫెరల్ న్యూరోపతి అనేది మరొక కారణం. డయాబెటిస్ ఉన్నవారిలో ఈ సమస్య సర్వసాధారణం. నరాల దెబ్బతినడం వలన మెదడుకు చల్లగా ఉన్న భావన సంకేతంగా పంపబడుతుంది, దీనివలన కాళ్లు చల్లగా అనిపిస్తాయి.
గమనిక: ఇంట్లో కాళ్లకు మసాజ్ చేసుకోవడం, పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో కాళ్లు పెట్టుకోవడం తాత్కాలిక ఉపశమనం ఇస్తుంది. అయితే చల్లని కాళ్లతో పాటు తిమ్మిర్లు, రంగు మారడం, గాయాలు మానకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సలహా తీసుకోవాలి.
