పదేళ్లకు ఓ సారి జనగణన నిర్వహించి పౌరుల సమాచారం కేంద్ర ప్రభుత్వం సేకరిస్తుంది. ఈ లెక్కల ప్రకారమే ప్రభుత్వ పథకాలను రూపొందిస్తుంది. వాస్తవానికి జనగణన-2020 సెప్టెంబర్ నెలలో ప్రారంభం అవ్వాల్సింది. కానీ, కరోనా వేళ ఈ ఏడాది జనగణన ఎప్పటిలా జరిగేలా కనిపించట్లేదు. అయితే, 16వ దేశ జనగణనకు కొత్త మార్గదర్శకాలు తేదీని త్వరలో ప్రభుత్వం ప్రకటించనుంది. ఈ సారి జనగణన కాస్త భిన్నంగా ఉండే అవకాశముందంటున్నారు అధికారులు.
2012 భారత జన గణన ప్రకారం.. దిల్లీ జనాభా 1.90 కోట్లుగా అంచనా వేశారు. ఆ గణాంకాల ప్రకారమే ప్రభుత్వం పథకాలను రూపొందిస్తోంది. కానీ, ఏటా కనీసం 5 లక్షల మంది వలస కూలీలు వస్తూ, పోతూ ఉండడం వల్ల ఆ పథకాలు ఊహించిన స్థాయిలో ప్రజలకు చేరేవి కావు. ఇలాంటి పరిస్థితిని ప్రతి రాష్ట్రం ఎదుర్కొంటోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఈ సారి పౌరుల పూర్తి వివరాలతో జనగణన చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం.ఇందుకోసం సాంకేతిక సాయంతో.. ఓ ప్రత్యేక యాప్ ను రూపొందిచనున్నారు. 16 భారతీయ భాషల్లో అందుబాటులో ఉండే ఈ యాప్లో జనగణనకు సంబంధించిన ప్రశ్నలు సిద్ధం చేసి పెడతారు. ఈ ప్రక్రియను దాదాపు 30 లక్షల మంది వలంటీర్లు పర్యవేక్షిస్తారు.