చలి చంపేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో చలికి ప్రజలు వణుకుతున్నారు. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటే.. భయపడుతున్నారు. దీంతో పాటు పొగమంచుతో ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఇదివరకే ప్రకటించింది. అన్ని జిల్లాలో ఉష్ణోగ్రతలు సగటున 11-15 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. తూర్పు, ఆగ్నేయ ప్రాంతాల నుంచి చలి గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఇదిలా ఉంటే ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్, సిరిసిల్ల, జగిత్యాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. ఈజిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ కూడా జారీచేసింది. ఇదిలా ఉంటే ఏపీలో కూడా చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. విశాఖ మన్యం చలిగాలులతో గజగజ వణుకుతున్నారు. చింతపల్లిలో 3 డిగ్రీలు, సీలేరులో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.