కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే దేశీయ, అంతర్జాతీయ విమానాలను రద్దు చేయడమే కాకుండా, రైళ్లను కూడా నిలిపివేసింది. అంతేకాకుండా భౌతిక దూరం పాటించాలని, తరుచు చేతులను శుభ్రం చేసుకోవాలని ప్రజల్లో అవగాహన కలిగించింది. దీంతో అమెరికా, స్పెయిన్, ఇటలీలతో పోల్చినప్పుడు భారత్‌లో కరోనా తీవ్రత తక్కువగానే ఉందనే చెప్పాలి. జనాభా పరంగా ఆయా దేశాలతో పోలిస్తే భారత్ చాలా పెద్దది. అయినా కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడా ద్వారానే కరోనాను కొంతమేర కట్టడి చేయగలిగింది.అయితే ఒకవేళ భారత్‌లో లాక్‌డౌన్ విధించకపోయి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవో అనే భయం కూడా కలుగుతుంది.
అయితే ఈ విషయంపై కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ఆసక్తికర విషయాన్ని తెలిపింది. భారత్ లాక్‌డౌన్ విధించకపోయినా, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోయినా.. ఏప్రిల్ 15 వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8.2 లక్షలుగా నమోదయ్యేవని అంచనా వేసింది. కరోనాపై రోజువారి మీడియా సమావేశంలో భాగంగా శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘మేము జరిపిన గణంకాల విశ్లేషణ ప్రకారం కరోనా కేసులు విపరీతంగా పెరిగేవి. ఏప్రిల్ 11 వరకు 2.08 లక్షలకు, ఏప్రిల్ 15 వరకు 8.20 లక్షలకు చేరేవి. ఒకవేళ లాక్‌డౌన్ విధించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటే ఏప్రిల్ 15 వరకు 1.2 లక్షల కేసులు నమోదయ్యేవి’ అని తెలిపారు.
లాక్‌డౌన్ విధించడంతోపాటు భౌతిక దూరం పాటించడంపై ప్రజల్లో అవగాహన కలిగించడం వల్ల ఇండియాలో కేసుల సంఖ్య తక్కువగా ఉందన్నారు. భారత్ కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో 586 హాస్పిటల్స్ పూర్తిగా కరోనా బాధితులకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అందులో ఒక లక్ష ఐసోలేషన్ బెడ్స్, 11,836 ఐసీయూ బెడ్స్ సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.