లాక్‌డౌన్ వేళ విధుల నిర్వర్తిస్తున్న పోలీసుల పరిస్థితి కత్తి మీద సాములా మారింది. కొన్నిచోట్ల కొందరు వ్యక్తులు పోలీసులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని లాలపేట్‌లో ఓ తల్లి, కొడుకు ఏకంగా పోలీసులపై దాడికి దిగారు. శుక్రవారం లాలపేట్‌లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు.. చెక్‌పోస్ట్ వద్ద బైక్‌పై ట్రిబుల్ రైడింగ్ చేస్తున్నవారిని ఆపి ప్రశ్నించారు. ఆ సమయంలో బైక్‌పై జీనత్ బేగం(45), ఆమె కుమారుడు యూసఫ్ ఖాన్(22) , ఆమె భర్త ఉన్నారు.
అయితే బేగం, యూసఫ్‌లు బైక్ ఆపిన పోలీసులపై బెదిరిపులకు దిగడమే కాకుండా, దాడి చేశారు. అలాగే వారిని బెదిరించేలా మాట్లాడారు. ఒక దశలో బేగం.. పోలీసు అధికారి కాలర్ పట్టుకున్నారు. ఇలా కొద్ది సేపు అయ్యాక పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరోవైపు బేగం మాత్రం పోలీసులు తన కొడుకును పోలీసులు దూషించారని చెబుతోంది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసలు మాట్లాడుతూ.. ట్రిబుల్ రైడింగ్ గురించి ప్రశ్నించగా ఆ మహిళ, ఆమె కుమారుడు తమపై దాడి చేశారని చెప్పారు. తాము వారిని దూషించలేదని తెలిపారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి.. బైక్‌పై ట్రిబుల్ రైడింగ్ వెళ్తున్నందుకే వారిని అడ్డగించామని వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.