సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. దీంతో సైబర్ మోసగాళ్ల చేతిలో ఎంతో డబ్బు నష్టపోతున్నారు. తాజాగా ఓ మహిళకు కూడా ఇలాగే జరిగింది. ఆమె బర్గర్ తినాలని ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో ఆర్డర్ చేసింది. అయితే సైబర్ మోసగాళ్ల బారిన పడి డబ్బు నష్టపోయింది. వివరాల్లోకి వెళితే..
నోయిడాలోని సెక్టార్ 45లో నివాసం ఉండే 24 ఏళ్ల రీనా చౌహాన్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇటీవల బర్గర్, స్నాక్స్ తినాలని చెప్పి ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో ఆర్డర్ చేసింది. తమకు సమీపంలో ఉన్న బర్గర్ కింగ్ నుంచి ఆమె వాటిని ఆర్డర్ చేసింది. అయితే ఆమె ఆర్డర్ చేసే సమయానికి ఆ రెస్టారెంట్ ఓపెన్ చేయలేదు. దీంతో స్విగ్గీ వారు ఆమె ఆర్డర్‌ను క్యాన్సిల్ చేశారు. ఇదే విషయమై ఆమెకు కాల్ చేసి తెలియజేశారు.
అయితే డబ్బులు ఆటోమేటిగ్గా రీఫండ్ వచ్చే విషయం తెలియక ఆమె గూగుల్‌లో స్విగ్గీ కస్టమర్ కేర్ నంబర్ కోసం వెదికింది. ఆమెకు ఓ నంబర్ కనిపించగా దానికి కాల్ చేసింది. వారు స్విగ్గీ కస్టమర్ కేర్ ప్రతినిధులు కానప్పటికీ తాము స్విగ్గీ ప్రతినిధులమే అని చెప్పి ఆమెను నమ్మించారు.
తరువాత ఆమెను ఫోన్‌లో ఎనీ డెస్క్ అనే యాప్ ఇన్‌స్టాల్ చేయమని చెప్పారు. దీంతో డబ్బులు రీఫండ్ చేస్తారేమోనని చెప్పి ఆమె ఆ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసింది. అయితే అవతలి వారు ఆమె ఫోన్‌ను ఆ యాప్ ద్వారా కంట్రోల్‌లోకి తీసుకున్నారు. ఆమె ఖాతా నుంచి రూ.21,865 మేర ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు. దీంతో మోసాన్ని గ్రహించిన ఆమె వెంటనే యాప్‌ను నిలిపివేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.