ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల కోసం వాట్సాప్‌లో కరోనా హెల్త్ అలర్ట్ సేవను ప్రారంభించింది. శనివారం నుంచి ఈ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు WHO ఒక ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమ తమ ఫోన్లలో +41 79 893 1892 ఫోన్ నంబర్‌ను సేవ్ చేసుకుని దానికి Hi అని మెసేజ్ పంపితే చాలు.. అందులో పలు ఆప్షన్లతో కూడిన ఓ లిస్ట్ వస్తుంది. దాంట్లో వినియోగదారులు తమకు నచ్చిన ఆప్షన్‌ను ఎంచుకుని కరోనా వైరస్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
WHO వాట్సాప్‌లో ప్రారంభించిన కరోనా హెల్త్ అలర్ట్ సేవల ద్వారా ప్రజలు కరోనా వైరస్ గురించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. దాంట్లో నిజమైన సమాచారం మనకు తెలుస్తుంది. అలాగే కరోనా వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, సహాయం అవసరం అయితే ఎవరిని సంప్రదించాలి.. అన్న వివరాలు కూడా ఉంటాయి. దీని వల్ల రోజులో 24 గంటలూ ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్ల ద్వారా వాట్సాప్‌లో కచ్చితమైన, నిజమైన సమాచారాన్ని తెలుసుకుని అలర్ట్‌గా ఉండవచ్చని WHO ప్రతినిధి ఒకరు తెలిపారు.
కాగా ప్రస్తుతం WHO ప్రారంభించిన ఈ సేవలు కేవలం ఇంగ్లిష్ భాషలోనే అందుబాటులో ఉండగా.. త్వరలోనే అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్ భాషల్లోనూ అందుబాటులోకి తేనున్నారు. ఇక కరోనా వైరస్ నేపథ్యంలో ప్రచారమవుతున్న ఫేక్ న్యూస్‌కు కూడా దీని వల్ల అడ్డుకట్ట వేయవచ్చని WHO అభిప్రాయపడింది. అయితే కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు మరోవైపు వాట్సాప్ కూడా ఇప్పటికే 1 మిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించగా ఇప్పుడు.. ఆ సంస్థ WHOతో కలిసి పూర్తి స్థాయిలో ఆ వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది..!