దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు గాను కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీపై ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో ఉన్న రైతులు, వలస కార్మికులు ఓ వైపు చేతిలో డబ్బు లేక ఇబ్బందులు పడుతుంటే.. వారికి డబ్బులు ఇవ్వాల్సింది పోయి.. లోన్లు ఇస్తామంటారా.. అని ధ్వజమెత్తారు. దేశంలో ఎంతో మంది వలస కార్మికులు ఖాళీ కడుపుతో, పొట్ట చేత పట్టుకుని సొంత ఊళ్లకు వెళ్తున్నారని, ఎంతో మంది చిరు వ్యాపారులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దివాలా తీశాయని.. ఇలాంటి స్థితిలో వారికి కావల్సింది డబ్బు అని.. లోన్లు కాదని అన్నారు.
కేంద్రం ప్రజలకు లోన్లు ఇచ్చే కన్నా.. డబ్బు ఇస్తే బాగుంటుందని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోదీ ఈ ప్యాకేజీపై మరొకసారి ఆలోచించాలన్నారు. ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేయాలన్నారు. అలాగే రైతులకు కూడా నేరుగా నగదు సహాయం అందించాలన్నారు. శనివారం మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ.. దేశంలో పతనం కానున్న ఆర్థిక వ్యవస్థపై ఫిబ్రవరిలోనే చెప్పానని అన్నారు. పేద ప్రజల అకౌంట్లలో నగదు వేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామన్నారు. రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ మరింత పతనమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
దేశ ప్రజలు కరోనా బారిన పడకుండానే.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రం యత్నించాలని రాహుల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమకు సహాయం చేయాలని అడుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ విషయంపై ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. కరోనాపై పోరును మరింత ఉధృతం చేయాలన్నారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు కావల్సిన సహాయ సహకారాలను సమానంగా అందించాలని తెలిపారు.