వాతావరణం కాలిపోతుంది… అవును భూమి వేడెక్కడమే కాదు… వాతావరణం ఎక్కువగా కాలిపోతుంది. బయటకు రావాలి అంటే చాలు జనం వణికిపోయే స్థాయిలో ఉంది. ఇది క్రమంగా పెరుగుతుంది… ఇంకా ఇంకా పెరుగుతుంది. ప్రతీ ఇంటికి ఏసీ అవసరం అవుతుంది. ఏసీలు లేకుండా జనం బ్రతకలేని పరిస్థితి వస్తుంది… ఈ విషయం చెప్పింది ఒకరు ఇద్దరు కాదు… పది వేల మంది శాస్త్రవేత్తలు. దాదాపు 40 ఏళ్ళ నుంచి వరుసగా పరిశోధనలు చేసి ప్రతీ రోజుని అధ్యయనం చేసి వెల్లడించిన వాస్తవాలు ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. జనాభా పెరుగుదల, జంతువుల సంఖ్యలో పెరుగుదల, తలసరి మాంస ఉత్పత్తి, అంతర్జాతీయంగా వృక్షాల నరికివేత, శిలాజ ఇంధనాల వినియోగం,
ఆహార ఉత్పత్తుల్లో మారిన విధానాలు, పంటలకు వేస్తున్న రసాయనాలు, వాహనాల పెరుగుదల, వంటివి ఇప్పుడు వాతావరణాన్ని మరీ దారుణంగా మారుస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో ఈ విషయాలను ప్రస్తావించారు శాస్త్రవేత్తలు. గత 40 ఏళ్లలో ఏకంగా 20 లక్షల ఎకరాల్లో అడవులను పూర్తిగాను, పాక్షికంగాను మనుషులు నరికేశారని చెప్పారు. దీనితో వర్షపాతం కొన్ని ప్రాంతాల్లో గణనీయంగా పడిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణంలో దీని కారణంగా ఎక్కువగా మార్పులు వచ్చాయని కూడా చెప్పారు.
ఇకపోతే దీని నుంచి రక్షించుకునే మార్గాలు మన చేతుల్లో ఉన్నా సరే మన అలసత్వం కారణంగా భావితరాలకు మరింత ప్రమాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా పెట్రోల్, డీజిల్ వాహనాల వాడకం తగ్గిస్తే మంచిది అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం కూడా తగ్గిస్తే మంచిది అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. రాజకీయ నాయకులు దీనిని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం చెయ్యాలని ఎన్నికల ప్రకటనల్లో చేయడమే కాదు ప్రజలను ఆ విధంగా మార్చాలని అంటున్నారు. అడవులను, పచ్చికబయళ్లను, మడ అడవులను పెంచాలి. ఇలా చేస్తే కార్బన్‌డయాక్సైడ్ స్థాయిని తగ్గించే అవకాశం ఉంటుందని అంటున్నారు.