ఈ ప్రపంచంలో ఎన్నో విచిత్రమైన, విషపూరితమైన జీవరాశులు ఉన్నాయి. ఇక ఈల్ చేపలు ఎంత విషపూరితమైనవో తెలిసిందే. తాజాగా అమెజాన్ రెయిన్ ఫారెస్టులోని జలాల్లో అత్యంత ప్రమాదకరమైన ఎలక్ట్రిక్ ఈల్ చేపలను సైంటిస్టులు గుర్తించారు. శరీరంలో కరెంట్‌ను తయారుచేసి శత్రువులపై దాడి చేసే చేప ఈల్ చేప. అమెజాన్ రెయిన్ ఫారెస్టులో ఎలక్ట్రిక్ ఈల్ చేపల జాతులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. స్మిత్ సోనియన్ ఇన్సిట్యూట్ అండ్ నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీకి చెందిన సైంటిస్టులు, సాయో పాలో రీసెర్చ్ ఫౌండేషన్ సైంటిస్టుల బృందం కలిసి ఈ రీసెర్చ్ జరిపింది.
ఈ క్రమంలోనే విద్యుత్ చేప లేదా ఎలక్ట్రిక్ ఈల్ ఒక రకమైన చేప. తన శరీరం నుండి దాదాపు 860 వోల్టుల విద్యుత్ శక్తిని విడుదలచేయడం ప్రత్యేకత. ఈ ఈల్ విద్యుత్ చేప కుడితే.. మనిషికి తట్టుకోలేనంతగా విద్యుత్ ఉత్పత్తి అయ్యి షాక్ గురైన వ్యక్తి వెంటనే స్పృహ లేదా ప్రాణాలు కోల్పోవాల్సిందే. ఈ కరెంట్ ప్రభావంతో గుర్రం లాంటి జంతువులు సైతం కింద పడి గిలగిల కొట్టుకుంటాయి. దీని ప్రత్యేకత శత్రు జీవికి కరిచి కరెంటు షాకివ్వడమే కాదు. వాటి నాడీవ్యవస్థపై ప్రభావం చూపి వాటి కండరాల్ని సైతం నియంత్రిస్తుంది.
అంటే ఇదో రిమోట్‌లా పనిచేస్తూ దూరం నుంచే విద్యుత్ సంకేతాలు పంపి శత్రు జీవిని అదుపులోకి తెచ్చుకుంటుందన్నమాట. సుమారు ఎనిమిదడుగుల పొడవు ఎదిగే ఈల్ చేపల్లో మూడు రకాల వోల్టేజ్ ఆర్గాన్స్ ఉంటాయి. అలాగే పెద్ద ఎలక్ట్రిక్ ఈల్స్ 12 బల్బులు వెలగడానికి సరిపోయేంత విద్యుత్‌ను విడుదల చేస్తాయి. ఈ చేపల్లో దాదాపు ఆరు వేలకు పైగా ఎలక్ట్రిక్ కణాలుంటాయి. ఈ కణాలే విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఒక్కో కణం 0.1 వోల్టేజి విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు. కొన్ని ఎలక్ట్రిక్ ఈల్స్ 50 కార్లను స్టార్ట్ చేసే విద్యుత్‌ను పుట్టించగలవు. ఎక్కువగా మట్టి నీళ్లలో ఉండే ఇవి పది నిమిషాలకోసారి బయటకొస్తాయి.