వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిద్దామనుకున్న ఐసీసీ ఆశలు అడియాశలయ్యాయి. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూశారు. కానీ వర్షం వారి ఆసక్తిని నీరుగార్చింది. ఫలితంగా 5 రోజుల టెస్టు మ్యాచ్‌లో ఇప్పటికే 2 రోజులు వర్షం కారణంగా వృథా అయ్యాయి. అయితే రిజర్వ్ డే ఎలాగూ ఉంది కాబట్టి ఆ రోజు కూడా కలిపితే ఇంకో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. మరి ఇంతటి తక్కువ సమయంలో మ్యాచ్ లో ఫలితం తేలుతుందా ? అది అనుమానంగానే ఉంది.
మ్యాచ్‌లో ఒక రోజు ఆట జరగకపోయినా 4 రోజులు ఉన్నాయి కదా. కచ్చితంగా ఫలితం వస్తుందని అనుకున్నారు. కానీ 4వ రోజు వర్షం కారణంగా మ్యాచ్ జరగలేదు. దీంతో రిజర్వ్ డే రోజు మ్యాచ్‌ను నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే కేవలం 2 రోజులే సమయం ఉంది కాబట్టి మ్యాచ్ ఫలితం తేలుతుందని చెప్పలేం. కానీ రెండు జట్లు తక్కువ స్కోర్లకే ఆలౌట్ అయితే ఒక అవకాశం ఉంటుంది. కానీ అలా జరిగితే ఏదో మిరాకిల్ జరిగినట్లే అనుకోవాలి. అందువల్ల ఐసీసీ నిర్వహిస్తున్న మొదటి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని తెలుస్తుంది.
అయితే 5వ రోజు ఆట ముగిశాక మ్యాచ్‌ను డ్రాగా ముగిస్తున్నామని ప్రకటించే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే అనుకోని కారణాల వల్ల ఓవర్లను కోల్పోయినా మ్యాచ్‌లో ఫలితం తేలేలా ఉంటేనే రిజర్వ్ డేను ఉపయోగిస్తారు. కానీ రెండు రోజులు పూర్తిగా ఆట జరిగినా ఫలితం తేలే అవకాశాలు దాదాపుగా కనిపించడం లేదు. అందువల్ల 5వ రోజు ఆట ముగిసే సమయానికి పరిస్థితిని బట్టి ఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. అదే జరిగితే రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించడం ఖాయంగా కనిపిస్తోంది.