ఇంతకీ యాదాద్రినా.. యాదగిరి గుట్టనా?

-

‘సంస్కృతీకరణ’ అంటే? తెలుగు పదం ‘మోటు’ అనిపిస్తే.. సంస్కృతంలో ‘షాని’ చేయడం. యాదగిరి గుట్ట మోటు. యాదాద్రి షాని. గిరి పదం కూడా సంస్కృతమే. అయినా సరే అది ‘అద్రి’గా మారిపోయింది. స్ధానిక వ్యవహార నామం ‘గుట్ట’. ఇది అచ్చతెనుగు పదం. అందుకే తెలంగాణలో ఎందరో యాదగిరులు కనిపిస్తారు. నర్సింహులు ఉంటారు. ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ పేరు కూడా యాదగిరియే. అంతేకాదు.. తెలంగాణ దూరదర్శన్ చానల్ కూడా ‘యాదగిరి’.

ఎంతో గొప్ప సత్ సంకల్పంతో.. తెలంగాణకు ఒక గుర్తింపు పొందిన ఆలయం ఉండాలనే ఉద్దేశంతో.. ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరి గుట్ట పునర్ నిర్మాణం చేపట్టారు. చినజీయర్ స్వామి సూచనతో యాదగిరి గుట్ట పేరును యాదాద్రిగా మారుస్తున్నట్లుగా ప్రకటించారు. అప్పుడే విమర్శలు వచ్చాయి. పేరుమార్చినా జనం మాత్రం యాదగిరి గుట్టకు వెళ్లొచ్చామనే అంటున్నారు తప్ప యాదాద్రికి వెళ్లొచ్చామని మాత్రం అనటం లేదు. స్థానిక పరిభాష ఎలా ఉన్నా ‘యాదాద్రి’ పేరు వార్తలకు, అధికారిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితమైది.

యాదాద్రి? యాదగిరి గుట్ట? ఏపేరుతో పిలవాలి? పాత పేరా? కొత్త పేరా? మళ్లీ పేచీ మొదలయ్యింది. ఇందుకు పేరు మార్చిన ప్రభుత్వమే కారణం కావడం మరో విశేషం. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం యాదాద్రిలో పర్యటించారు. తొగుట పీఠాధిప‌తి మాధ‌వానంద స‌ర‌స్వతి స్వామివారి చేతుల మీదుగా నూతన రామ‌లింగేశ్వర స్వామి ఆల‌య ఉద్ఘాట‌న క్రతువులో పాల్గొన్నారు. మ‌హా పూర్ణాహుతి, మ‌హాకుంభాభిషేకం నిర్వహించారు.

ఇంతవరకు బాగానే ఉన్నా..సీఎం పర్యటనకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన సమాచారంలో మాత్రం వింత చోటు చేసుకుంది. ‘యాదాద్రి’ బదులు.. ‘యాదగిరి గుట్ట’గా పేర్కొన్నారు. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. మొత్తంగా చిన్నజీయర్ స్వామితో మొదలైన వివాదం మరింతగా ముదిరిపాకాన పడుతోందన్న సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి.

చినజీయర్‌తో వివాదం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఆయనకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఆలయ నిర్మాణ సమయంలో కీలకంగా వ్యవహరించిన చిన జీయర్ ను..ఆలయ ప్రారంభోత్సవానికి పిలవలేదు. జీయర్ స్వామి లేకుండానే ప్రారంభోత్సవం జరిగింది. దాంతో యాదాద్రి పేరును మళ్లీ యాదగిరి గుట్టగానే పిలవాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన సమాచార ప్రకటనల్లో అధికారులు యాదగిరిగుట్టగా పేర్కొనడం మరో చర్చకు దారి తీసింది.

కొస‌మెరుపు ఏమిటంటే..ఆల‌యానికి సంబంధించిన అధికారిక వెబ్ సైట్ లోనూ, టూరిజం శాఖ వెబ్ సైట్ లోనూ యాద‌గిరి గుట్ట‌గానే ఉండ‌టం.

Read more RELATED
Recommended to you

Exit mobile version