ఆ మంత్రి గారి పేరు చెబితే అదిరిపడుతున్న వైసీపీ నేతలు

-

ఆ మంత్రిగారు పెరు చెబితే సొంత పార్టీ నేతలే అదిరిపడుతున్నారట.పార్టీలోనూ, ప్రభుత్వ కార్యకలాపాలలోనూ భేదాభిప్రాయాలు వచ్చినా.. లోటుపాట్లు ఉన్నా ఇంఛార్జ్‌లు పరిష్కరిస్తారులే అన్న ధీమాలో ఉంటారు అధికార పార్టీ నేతలు. కానీ జిల్లా ఇంచార్జ్ గా వచ్చిన ఆ మంత్రి గారి దూకుడు సొంత పార్టీనేతలనే ఓ రేంజ్ లో టెన్షన్ పెట్టిందట.ఆయనవల్ల వచ్చే మైలేజ్ కంటే ఎదురయ్యే డ్యామేజీని తలచుకుని తెగ ఆందోళన చెందుతున్నారట.

విజయనగరం జిల్లాలోని పుణ్యక్షేతం రామతీర్థంలో కోదండరాముని విగ్రహం ధ్వంసం చేసిన ఘటన దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఆయా పార్టీల నాయకుల తీరుతో సమస్య రాజకీయ రంగు పులుముకొంది. పోటాపోటీ ఆందోళనలు నిర్వహించాయి. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు సహా అంతా ఆలయ సందర్శనకు వచ్చారు. అయితే వీరందరికన్నా జిల్లా ఇంచార్జీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీరే ఇప్పుడు చర్చగా మారిందట.

రామతీర్థం ఘటన జరిగిన తర్వాతి రోజు జిల్లాలో సీఎం కార్యక్రమానికి హాజరైన మంత్రి కనీసం సంఘటనా స్థలానికి వెళ్లలేదు. ఆలయ చైర్మన్‌గా ఉన్న అశోక్‌గజపతిరాజును తొలగించిన తర్వాత మీడియా ముందుకొచ్చిన మంత్రి వెలంపల్లి చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీనే ఇరకాటంలో నెట్టాయి. ఈ వ్యాఖ్యలపై రచ్చ జరుగుతుండగానే జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి ఎట్టకేలకు రామతీర్థం వెళ్లిన వెలంపల్లి కేంద్రమాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పై శృతి మించి విరుచుకుపడ్డారు.

పూసపాటి గజపతుల వారసుడిగా అశోక్‌గజపతిరాజు కి పార్టీలకు అతీతంగా జిల్లా ప్రజల్లో గుర్తింపు ఉంది. జిల్లాకే చెందిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, మంత్రి బొత్స సత్యనారాయణలు అశోక్‌పై విమర్శలు చేసినా.. మరీ వెలంపల్లి స్థాయిలో ఎప్పుడు నోరు జారలేదు. ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త మలుపు తీసుకుని క్షత్రియ సామాజికవర్గం ఆగ్రహానికి కారణమైంది. అశోక్‌ను వ్యక్తిగతంగా విమర్శించే హక్కు వెలంపల్లికి లేదని ఇంటా బయట విమర్షలు రావడంతో స్థానిక ఎన్నికల వేళ కొత్త సమస్య తీసుకొచ్చారని వెల్లంపల్లి పై సొంత పార్టీ నేతలే గొనుక్కుంటున్నారట… అశోక్‌పై సానుభూతి పెరిగి అది ఎక్కడ టీడీపీకి ప్లస్‌ అవుతుందోనని ఆందోళన చెందుతున్నారట వైసీపీ నేతలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version