వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. దాడికి యత్నం..

-

వైసీపీ ప్రభుత్వం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణకు చేదు అనుభవం ఎదురైంది. ఆయనను చూడగానే రంకెలేసిన మహిళలు మెడలోని కండువా పట్టుకుని దాడికి యత్నించారు. దుర్భాషలాడుతూ వెంబడించారు. దీంతో పోలీసుల రక్షణ మధ్య ఆయన బయటపడ్డారు. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం మాడగడ గ్రామంలో జరిగిందీ ఘటన. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా ఎమ్మెల్యే నిన్న గ్రామానికి చేరుకున్నారు. ఆయనను చూడగానే ఆగ్రహంతో ఊగిపోయిన గిరిజన మహిళలు.. ‘‘మా భూములను కబ్జా చేసి మళ్లీ మా ఊరే వస్తావా?’’ అంటూ ఆయన మెడలోని కండువా పట్టుకుని నిలదీశారు.

గిరిజనులందరూ గుమికూడి ఆయనపైకి ఎగబడి దాడికి యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని దూరంగా తీసుకెళ్లారు. అయినా శాంతించని గ్రామస్థులు భూములను కబ్జా చేస్తావా? అని దుర్భాషలాడుతూ వెంబడించారు. దీంతో చేసేది లేక పోలీసులు, వైసీపీ కార్యకర్తల రక్షణ మధ్య అక్కడి నుంచి బయటపడ్డారు. అనంతరం భూముల కబ్జా ఆరోపణలపై ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ స్పందిస్తూ.. తాను బ్యాంకు ఉద్యోగిగా ఉన్న సమయంలో 2012లో గోమంగి మధుసూదనరావు నుంచి సర్వే నంబరు 82లో ఉన్న 5.72 ఎకరాల పట్టాభూమిని కొనుగోలు చేసినట్టు చెప్పారు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ.

అందుకు సంబంధించిన పత్రాలు తన వద్ద ఉన్నాయన్నారు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ. అయితే, ఇప్పుడీ భూముల ధరలు పెరగడంతో కావాలనే తాను ఆ భూమిని కబ్జా చేసినట్టు ఆరోపిస్తున్నారని ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కసుతోనేవారు తనపై అలా ప్రవర్తించారని ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version