తాడికొండలో రాజకీయ వివాదం ముదురుతోంది. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మాజీ అనుచరుల నుండి తనకు ప్రాణహాని ఉందంటూ నలుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.
మరోవైపు ఎమ్మెల్యే నుంచే తనకు ప్రాణహాని ఉందంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు ఎమ్మెల్యే మాజీ అనుచరుడు సందీప్. తనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని సందీప్ ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే శ్రీదేవికి కొంతమంది దగ్గర అప్పుగా డబ్బులు ఇప్పించానని.. తిరిగి ఇవ్వమని అడిగితే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు సందీప్.
ఇటీవలే సురేశ్, సందీప్‌లను వైసీపీ నుంచి బహిష్కరించారు. వాళ్లిద్దరూ తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఉండవల్లి శ్రీదేవి ఆరోపిస్తున్నారు. సందీప్, సురేష్ చట్ట వ్యతిరేకంగా మద్యం వ్యాపారం చేస్తూ, పేకాట ఆడిస్తూ పెదకాకాని పోలీసులకు పట్టుబడ్డారని శ్రీదేవి గుర్తుచేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతోనే.. వారిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు శ్రీదేవి. మరోవైపు శ్రీదేవి, ఎంపీ నందిగం సురేష్ పై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగుల వెనుక ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ హస్తం ఉందని ఎమ్మెల్యే అనుచరులు ఆరోపిస్తున్నారు.