టీడీపీ కంచుకోటలో వైసీపీ కొత్త ప్రయోగం

-

పశ్చిమగోదావరి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి చిక్కని రెండు నియోజకవర్గాల్లో ఉండి ఒకటి. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉండి నియోజకవర్గంలో వైసీపీలో వర్గాలు కూడా ఎక్కువే. గత ఎన్నికల్లో భారీగానే ఖర్చు పెట్టారని.. పార్టీకి విధేయుడిగా ఉంటున్నారని ఇక్కడ ఓడిన నరసింహరాజునే ఇంఛార్జ్‌గా కంటిన్యూ చేశారు సీఎం జగన్. అలాంటిది ఉన్నట్టుండి నరసింహరాజును తీసేసి.. ఆ స్థానంలో కొత్త ఇంఛార్జ్‌ని ప్రకటించారు పార్టీ పెద్దలు..ఇప్పుడు దీని పైనే గోదావరి జిల్లా వైసీపీలో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

ఉండి నియోజకవర్గం వైసీపీలో అనుకున్నదే జరిగింది. పార్టీ ఇంఛార్జ్‌ మారిపోయారు. పార్టీలో ప్రక్షాళన తప్పదని అనుకున్నా ఇలా ఏకంగా ఇంఛార్జ్‌నే మార్చేయడంతో పార్టీ శ్రేణులు అవాక్కయ్యాయట. నరసింహరాజు అంటే పడని వారు..ఆయనకు వ్యతిరేకంగా ఎప్పుడూ కాలు దువ్వుతూనే ఉన్నారు. పలుమార్లు రోడ్డెక్కిన సందర్భాలు ఉన్నాయి. ఏకంగా నిరసన దీక్షకు దిగడంతో సమస్యలు కొలిక్కి తీసుకురావడానికి పార్టీ పెద్దలు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పార్టీ పెద్దలు సూచించడంతో మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు సైతం సర్దుకుపోతున్నారట. అయితే వైసీపీకి చెందిన నేత కోరుకొల్లు బాబు మాత్రం నరసింహరాజుపై గుర్రుగా ఉంటూ వస్తున్నారు.

ఇలా ఎవరికి వారు యమునా తీరేగా ఉండటంతో వైసీపీకి నష్టం జరుగుతోందని భావించిన జిల్లా పార్టీ ఇంఛార్జ్‌ వైవీ సుబ్బారెడ్డి సమస్య పరిష్కారానికి ఇంఛార్జ్‌ మార్పు ఒక్కటే అనే నిర్ణయానికి వచ్చారట. కొత్త ఇంఛార్జ్‌ కావాలని నరసింహారాజు వ్యతిరేకవర్గం కూడా గట్టిగానే ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. పాలకొల్లులో మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బాబ్జీని తప్పించి కొత్త ఇంచార్జ్‌ను నియమించినట్టే ఉండిలోనూ ప్రయోగం చేశారు. ఇంఛార్జ్‌ మార్పుపై పార్టీ నుంచి సమాచారం లేకపోయినా.. సంకేతాలు ఉండటంతో వ్యతిరేక వర్గంతో సర్దుకుపోయేందుకు నరసింహరాజు ప్రయత్నించారట. అప్పటికే సమస్య చేతులు దాటిపోయిందని సమాచారం.

మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు సోదరుడు రామరాజు అప్పట్లో వైసీపీలో చేరారు. ఆయనది కూడా ఉండి నియోజకవర్గమే. ఇప్పుడు నరసింహరాజును తొలగించి ఆ స్థానంలో గోకరాజు రామరాజును ఇంఛార్జ్‌ను చేసింది వైసీపీ. నరసాపురం లోక్‌సభ పరిధిలో తమకంటూ ప్రత్యేకంగా గుర్తింపు ఉండాలని పార్టీలో చేరినప్పుడే గోకరాజు ఫ్యామిలీ కోరిందట. ఉండి పరిణామాలు కూడా శ్రుతి మించి రాగాన పడటంతో.. వెంటనే మార్పులు చేసేసినట్టు అనుకుంటున్నారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో నరసింహరాజు రాజకీయ భవిష్యత్‌ ఏంటా అన్నది ప్రశ్నగా మారిందట. కొందరు ఓదార్చడానికి ప్రయత్నించగా.. తనను తొలగిస్తున్నట్టు నాకే తెలియదు అని బదులిచ్చారట నరసింహారాజు.

మొత్తానికి ఇంఛార్జ్‌ మార్పు పార్టీలో చర్చకు దారితీస్తే.. ఇప్పుడు నరసింహరాజు తీసుకునే నిర్ణయంపైనా రకరకాలుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రామరాజు రాకతో ఉండి వైసీపీలో వర్గపోరుకు చెక్‌ పడుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version