మస్ట్ రీడ్: వైసీపీ సెల్ఫ్ గోల్ మాటలు..!

-

పవన్ టాలీవుడ్ లో స్టార్ హీరోనే కానీ.. పాలిటిక్స్ లో మాత్రం కాదు అని అంటుంటారు వైకాపా నేతలు! కానీ విచిత్రంగా… పవన్ ను పాలిటిక్స్ లో కూడా హీరోని చేసే పనిలో వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా తప్పుటడుగులు చేస్తున్నారు! ఫలితంగా పవన్ స్థాయిని పెంచడంతోపాటు.. తమస్థాయిని తగ్గించుకునేపనికి పూనుకుంటున్నారు! తాజాగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు.. ఏపీ మంత్రుల స్పందనపై విశ్లేషణ ఇప్పుడు చూద్దాం.

పవన్ ప్రస్తుతం బీజేపీతో మిత్రత్వంలో ఉన్నారు. అయితే ఒకప్పుడు పవన్ కు బీజేపీ అవసరం చాలానే ఉన్నా… ఇప్పుడు బీజేపీకి పవన్ అవసరం ఎక్కువైపోయింది! గతకొన్ని రోజులుగా దూకుడుమీదున్న పవన్ కు తాజా రాజమండ్రి సభతో కాస్త మైలేజీ వచ్చిందనేది కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీని వదిలించుకునే ఆలోచనలో పవన్ ఉన్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి! బద్వేల్ ఉప ఎన్నిక నుంచి జనసేన వెనక్కి తగ్గడం.. బీజేపీని ఒంటరిగా వదిలేయడంతో.. వదిలించుకునే పనిపై కాస్త క్లార్టీ వచ్చేసింది!

ఈ పరిస్థితుల్లో పవన్ కచ్చితంగా టీడీపీతో కలిసే వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తారని అనుకోవాలి? టీడీపీకి గ్రౌండ్ లెవెల్ లో పటిష్టమైన నిర్మాణం ఉంది. ప్రస్తుతం బాబు ఆ నిర్మాణాన్ని చేజేతులా కూల్చుకుంటున్న పరిస్థితి… అది వేరే విషయం! ఈ క్రమంలో.. పవన్ కూడా బలమైన ఒక సామాజిక వర్గంలోని మెజారిటీ అండదండలు తమకు ఉంటాయని భావిస్తోన్నారు. తాజాగా అలాంటి మద్దతుకోసం అడుగులు మొదలెట్టేశారు కూడా! కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు కలవాలని, కలిసి రావాలని పవన్ బహిరంగంగానే పిలుపునివ్వడం అందుకు ఒక ఉదాహరణ!

దీంతో… ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కు ద‌మ్ముంటే ఒంట‌రిగా పోటీ చేసి గెల‌వాల‌ని స‌వాల్ విసురుతున్నారు ఏపీ మంత్రులు! అంటే.. పవన్ – టీడీపీ ఈ సారి కలిసి పోటీచేస్తే ఫలితాలు మారొచ్చనే టెన్షన్ వైకాపా నేతలకు పట్టుకుందనే సంకేతాలు.. వారే స్వయంగా ఇస్తున్న పరిస్థితి! ఎందుకంటే… గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొన్నిచోట్ల వైకాపాకొచ్చిన ఓట్లకంటే.. టీడీపీ + జనసేనకు వచ్చిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఇప్పుడు వైకాపా నేతల టెన్షన్ గా ఉంది! అందులో భాగంగానే… పవన్ కు దమ్ముంటే ఒంటరిగా పోటీచేయాలనే వాదన వైకాపా నేతలు తెరపైకి తీసుకొస్తున్నారు. ఫలితంగా సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు!!

దీంతో.. నిన్నమొన్నటివరకూ పవన్ – చంద్రబాబు కలిసినా… పవన్ – బీజేపీ కలిసినా… జగన్ కొచ్చిన డోకా ఏమీ లేదు.. వైకాపాకు కదిలించేది లేదు.. అని చెప్పిన వైకాపా నేతలు.. ఇప్పుడు పవన్ ఒంటరిగా రావాలని డిమాండులు చేయడం వల్ల పవన్ ని హీరోని చేయడమే కాకుండా.. తాము జంకుతున్నామనే సెల్ఫ్ గోల్ సంకేతాలు కూడా ఇచ్చినట్లవుతుందని అంటున్నారు విశ్లేషకులు!

Read more RELATED
Recommended to you

Exit mobile version