ఆ రెండు నియోజకవర్గాల పై స్పెషల్ ఫోకస్ పెట్టిన వైసీపీ

-

గత ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా తూర్పు గోదావరి జిల్లాలోని ఓ రెండు నియోజకవర్గాలు మాత్రం వైసీపీ చేతికి చిక్కలేదు. అసలే అక్కడ పట్టు చిక్కడం లేదంటే నాయకుల వర్గ విభేదాలు ఇంకాస్త రచ్చ రేపుతున్నాయి. ఇక నియోజవర్గ ఇంచార్జులు రాజీనామా చేశారో లేదో సడెన్‌గా కొత్త ఇంఛార్జులు తెరపైకి వచ్చారట..ఇదే ఇప్పుడు పార్టీలో చర్చకి దారి తీసింది. నేతల కలహాల కాపురాన్ని చక్కదిద్దే పని వైసీపీ అధిష్టానం ప్రారంభించిందా అన్న చర్చ నడుస్తుంది.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్‌, రూరల్‌ నియోజకవర్గాల్లో ఇంఛార్జ్‌ పదవులకు రాజీనామా చేశారు శివరామసుబ్రమణ్యం, ఆకుల వీర్రాజు. అయితే ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు మధ్య విభేదాలే కోఆర్డినేటర్ల మార్పునకు దారితీయడం అధికారపార్టీలో హాట్ టాపిక్‌ అయింది. ఇక ఇద్దరు నాయకులు రిజైన్‌ చేయడంతో కొత్త ఇంఛార్జుల అన్వేషణలో పడింది వైసీపీ. రాజమండ్రి అర్బన్ కి మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రూరల్‌కు ప్రముఖ వస్త్ర వ్యాపారి చందన నాగేశ్వరరావు పేర్లు వినిపిస్తున్నాయి. వీరినే దాదాపుగా ఖరారు చేస్తారని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గత ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోయింది. అప్పటి నుంచి ఇక్కడి పెత్తనం అంతా ఎంపీ భరత్‌దే. ఈ విషయంలోనే ఎప్పుడూ ఇంఛార్జులు, ఎంపీల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఇప్పుడా వివాదాలు ఏకంగా కోఆర్డినేటర్లను మార్చే స్థాయికి రావడమే కలకలం రేపుతోంది.
ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ ఇంఛార్జ్‌, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఇటీవల ఎంపీ భరత్‌, ఎమ్మెల్యే జక్కంపూడి మధ్య వివాదాలను సర్దుబాటు చేశారు. కానీ.. విభేదాలు సమసిపోలేదు. ప్రతి విషయంలోనూ గిల్లికజ్జాలే.

ఇక లాభం లేదనుకున్న వైసీపీ అధిష్టానం ఇంఛార్జులను తప్పించాలనే నిర్ణయానికి వచ్చి వారితో రాజీనామా చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చర్యతో ఇద్దరు నాయకులు అసంతృప్తి చెందకుండా.. శివరామ సుబ్రమణ్యానికి విజయనగరం జోనల్‌ ఆర్టీసీ చైర్మన్‌ పదవి.. ఆకుల వీర్రాజుకు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌ పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎంపీ భరత్‌ వర్గం మాత్రం అదేమీ లేదని కొట్టిపారేస్తున్నాయి.

స్థానిక ఎన్నికలకు అధికార పార్టీ సన్నద్ధమైన సమయంలో వచ్చిన ఈ మార్పులు కార్యకర్తలను ఆశ్చర్యపరిచాయట. ఇంఛార్జుల మార్పు ద్వారా ఎంపీ భరత్ పార్టీలోని ప్రత్యర్థులపై పైచేయి సాధించారని చెవులు కొరుక్కుంటున్నారు. ఇదే సమయంలో పార్లమెంట్ సమావేశాలకు కూడా వెళ్లకుండా.. పంచాయతీ ఎన్నికలను సవాల్‌గా తీసుకుని పనిచేస్తున్నారట భరత్‌. ఇంత వరకు బాగానే ఉన్నా.. కొత్తగా వచ్చే ఇంఛార్జులు ఎంత వరకు ఎంపీకి సహకరిస్తారు..కొత్త ఇంచార్జుల రాకతో వైసీపీ దశ మారుతుందా అన్న చర్చ ఇప్పుడు రాజమండ్రిలో నడుస్తుంది.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version