తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అంతే కాకుండా రాష్ట్రంలో ఎల్లో అలెర్ట్ ను వాతావరణ కేంద్రం జారీ చేసింది. మరఠ్వాడా నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ద్రోణి వల్ల రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అలాగే మంగళ వారం, బుధ వారం తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురం భీ, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, సూర్యపేట, నల్లగొండ జిల్లాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అంతే కాకుండా ఆయా జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ ను కూడా వాతావరణ కేంద్రం జారీ చేసింది. ఈ జిల్లాల తో పాటు రాష్ట్రంలో మరి కొన్ని జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.