ఎదుటివారితో మాట్లాడాలన్న, స్టేజి మీద అందరి ముందు మాట్లాడాలన్నా చాలా మంది భయపడుతుంటారు. సంభాషణలో ఏవైనా తప్పులు దొర్లుతాయేమోనన్న భయం వారిని మాట్లాడనివ్వకుండా చేస్తుంది. ఐతే మీ మనసులో ఏమనుకుంటున్నారో దాన్ని అవతలి వారికి సరిగ్గా అర్థమయ్యేలా చెప్పడం అంత ఈజీ కాదు. దానికోసం కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఏది పడితే అది మాట్లాడి అవతలి వారికి అర్థమైన కాకపోయినా అదే మంచి సంభాషణ అనుకుంటే పొరపాటు.
మంచి సంభాషణకి కావాల్సిన కొన్ని విషయాలు..
ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు వేరే పనులు చేయకండి. అటు ఫోన్ లో మాట్లాడుతూ ఇటు ఎదుటివారితో సంభాషణ జరపడం అస్సలు మంచిది కాదు. ప్రతీసారీ మీ పర్సనల అభిప్రాయాలను ఎదుటివారిపై రుద్దే ప్రయత్నం చేయవద్దు. అవతలి వాళ్ళు మీ అభిప్రాయాన్ని అంగీకరించకపోవచ్చు.
ఎదుటివారు ప్రశ్నలడిగితే దానికి సమాధానాలు చెప్పేందుకు సిద్ధంగా ఉండండి. ఇంకా చెప్పాలంటే, అవతలి వారిని ప్రశ్నలు అడగండి.
ఒకే ధారలో మాట్లాడండి. మీ మైండ్ లో వచ్చే ఆలోచనలను బయటకు చెప్పేయండి. మాట్లాడుతూ ఉంటే ఆలోచనలు అవే వస్తాయి.
మీకేదైనా విషయం తెలియకపోతే తెలియదని చెప్పండి. తెలుసని నటించవద్దు. చాలా ఈజీగా దొరికిపోయే అవకాశం ఉంది.
ఒకే విషయాన్ని రెండు మూడు సార్లు చెప్పవద్దు. మీ ఎదుటి వారికి బోర్ కొట్టడమే కాకుండా మీరు చెప్పేది వినకుండా చేస్తుంది.
ఒక విషయంలో మరీ డీటైల్స్ లోకి వెళ్ళకండి. చాలా మందికి వివరాలు అంతగా అవసరం ఉండవు.
మాట్లాడడం కంటే వినడం నేర్చుకుంటే మీ సంభాషణ ఇంకా బాగవుతుంది. చాలా మంది ఎదుటివాళ్ళు చెప్పేది వినరు. వారు చెప్పేదే ఇతరులు వినాలనుకుంటారు. సంభాషణ బోర్ కొట్టడానికి అదొక్కటి చాలు.