Business Idea : మొబైల్ రెస్టారెంట్ బిజినెస్‌.. మంచి లాభాలు..

-

రోజు రోజుకీ మారుతున్న జీవ‌న ప్ర‌మాణాల‌కు అనుగుణంగానే.. ప్ర‌జ‌ల ఆహార‌పు అల‌వాట్లు కూడా మారుతున్నాయి. అందుక‌నే భోజ‌న ప్రియుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. చాలా మంది భిన్న‌ర‌కాల ఆహారాల‌ను ట్రై చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. అందుక‌నే ఇప్పుడు న‌గరాల‌తోపాటు ప‌ట్ట‌ణాల్లోనూ మొబైల్ క్యాంటీన్లు పెరిగిపోయాయి. త‌క్కువ ధ‌ర‌ల‌కే రుచిక‌ర‌మైన‌.. భిన్న ర‌కాల వంట‌కాల‌ను మ‌న‌కు వారు అందిస్తున్నారు. అలాగే నిరుద్యోగుల‌కు, మ‌హిళ‌ల‌కు ఈ వ్యాపారం చ‌క్క‌ని స్వ‌యం ఉపాధిని క‌ల్పిస్తోంది. అయితే.. నిజానికి ఎవ‌రైనా స‌రే.. ఫుడ్‌ ట్రక్‌,మొబైల్ క్యాంటీన్ బిజినెస్‌ను చేయ‌వ‌చ్చు. అందులో కొంత పెట్టుబ‌డి పెట్టి శ్ర‌మిస్తే.. లాభాల‌ను పొంద‌వ‌చ్చు. కాకపోతే కొంచెం పెట్టుబడి ఎక్కువే.. మ‌రి ఈ వ్యాపారానికి ఎంత పెట్టుబ‌డి అవ‌స‌రం అవుతుంది..? ఎంత వ‌ర‌కు ఆదాయం ల‌భిస్తుంది..? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మొబైల్ క్యాంటీన్ (రెస్టారెంట్ ఆన్ వీల్స్‌) బిజినెస్‌ను ప్రారంభించేందుకు అనువైన వాహ‌నాన్ని కొనుగోలు చేయాలి. అందుకు రూ.4 ల‌క్ష‌ల వ‌ర‌కు అవుతుంది. అలాగే క్యాంటీన్‌కు అవ‌స‌రం అయిన స్ట‌వ్‌, పాత్ర‌లు, ఇత‌ర సామ‌గ్రి, టేబుల్స్‌, చెయిర్స్ త‌దిత‌రాల‌ను కొనుగోలు చేసేందుకు రూ.2 ల‌క్షలు అవుతుంది. ఇక వంట‌కాల త‌యారీకి కావ‌ల్సిన ముడి ప‌దార్ధాల‌ను కొనుగోలు చేసేందుకు రూ.20వేల నుంచి రూ.30వేల వ‌ర‌కు అవుతుంది. ఇక క‌స్ట‌మ‌ర్ల నుంచి డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలో పేమెంట్ల‌ను స్వీక‌రించేందుకు పీవోఎస్ మెషిన్‌ను త‌ప్ప‌నిస‌రిగా ఏర్పాటు చేసుకోవాలి. అందుకు మ‌రో రూ.30వేల వ‌ర‌కు అవుతుంది. దీనికి 6 నెల‌ల వ‌ర‌కు మ‌ళ్లీ ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఇక క్యాంటీన్‌లో ప‌నిచేసేందుకు మ్యాన్ ప‌వ‌ర్ అవ‌స‌రం అవుతుంది. నెల‌కు రూ.13వేల నుంచి రూ.15వేల‌కు ప‌నిచేసేలా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవ‌చ్చు. ఆ త‌రువాత క్యాంటీన్ వ్యాపారాన్ని ప‌బ్లిసిటీ చేసేందుకు నెల‌కు రూ.20వేల వ‌ర‌కు ఖ‌ర్చు చేస్తే వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. ఈ క్ర‌మంలో మొత్తం ఈ బిజినెస్ కోసం దాదాపుగా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి అవ‌స‌రం అవుతుంది. అయితే ఇంకా పెద్ద ఎత్తున బిజినెస్ చేయాలంటే.. అందుకు రూ.20 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి అవ‌స‌రం అవుతుంది.

ఇక మొబైల్ క్యాంటీన్ పెట్టాలంటే.. FSSAI లైసెన్స్‌, స్థానిక అగ్నిమాప‌క శాఖ అధికారుల నుంచి ఎన్‌వోసీ, లోక‌ల్ మున్సిప‌ల్ కార్యాల‌యం నుంచి వ్యాపారం చేసుకునేందుకు కావ‌ల్సిన అనుమ‌తి ప‌త్రం, వాహనాన్ని క‌మ‌ర్షియ‌ల్ ఉప‌యోగం కోసం వాడుతారు కనుక ఆర్‌టీవో నుంచి అందుకు సంబంధించిన అనుమ‌తి ప‌త్రాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ త‌రువాత మొబైల్ క్యాంటీన్ వ్యాపారం ప్రారంభించ‌వ‌చ్చు.

రూ.10 ల‌క్ష‌ల నుంచి రూ.20 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్టే సామ‌ర్థ్యం ఉన్న‌వారికి మొబైల్ క్యాంటీన్ వ్యాపారం చ‌క్క‌ని లాభాల‌ను ఇస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. దీని వ‌ల్ల క్యాట‌రింగ్ ఆర్డ‌ర్ల‌ను కూడా తీసుకోవ‌చ్చు. అలాగే నిర్దిష్ట‌మైన స్థ‌లం అంటూ అవ‌స‌రం ఉండ‌దు క‌నుక‌.. జ‌నాలు బాగా ఉన్న ప్రాంతాల్లో వాహ‌నాల‌ను నిలిపి వ్యాపారం చేసుకోవ‌చ్చు. దీంతో ఏయే ప్రాంతాల్లో ఉండే జ‌నాలు ఏయే ర‌కాల ఆహారాల‌ను తింటారు..? వారు ఆహారం కోసం ఎంత వ‌ర‌కు వెచ్చిస్తారు..? అక్క‌డ మొబైల్ క్యాంటీన్ నిర్వ‌హ‌ణ‌కు వ్యాపార అవ‌కాశాలు ఇంకా ఏ విధంగా ఉంటాయి..? ఇంకా ఏమేం ర‌కాల వంట‌కాల‌ను స‌ద‌రు ప్రాంత వాసుల‌కు అందించ‌వ‌చ్చు..? అనే విష‌యాల‌ను చ‌క్క‌గా అర్థం చేసుకుని.. ఆ మేర మొబైల్ క్యాంటీన్‌ను నిర్వ‌హించ‌వ‌చ్చు. దీంతో వ్యాపారం ఎప్పుడూ సుస్థిరంగా కొన‌సాగి.. లాభాలు వ‌స్తూనే ఉంటాయి.

మొబైల్ క్యాంటీన్ వ్యాపారం పెట్టాల‌నుకునే వారు ముందుగా అందుకు కావ‌ల్సిన స్థ‌లాల‌ను ఎంపిక చేసుకోవాలి. జ‌నాలు బాగా ఉన్న ప్రాంతంలో ఈ వ్యాపారానికి మంచి డిమాండ్ ఉంటుంది క‌నుక‌.. ఆ మేర స్థ‌లాల‌ను ఎంపిక చేసుకోవాలి. అప్పుడ‌ప్పుడూ స్థ‌లాల‌ను మారుస్తూ ఉండాలి. దీంతో వ్యాపారంపై చాలా వ‌ర‌కు అవ‌గాహ‌న వ‌స్తుంది. ఇక క్యాంటీన్ వ‌ద్ద‌కు వ‌చ్చే భోజ‌న ప్రియులు త‌మ వాహ‌నాల‌ను పార్కింగ్ చేసుకునేందుకు కావ‌ల్సిన స్థ‌లం కూడా ఉండేలా ఏర్పాటు చేసుకుంటే ఉత్త‌మం. అలాగే క్యాంటీన్‌ను శుభ్ర‌మైన వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించాలి. ప‌రిస‌రాలు ప‌రిశుభ్రంగా ఉండాలి. క్యాంటీన్‌లో వండే ఆహారాల‌ను శుచిగా, శుభ్రంగా క‌స్ట‌మ‌ర్ల‌కు అందివ్వాలి. భోజ‌నంలో నాణ్య‌త ఉండాలి. ఖ‌రీదు మ‌రీ ఎక్కువ‌గా ఉండ‌కూడ‌దు. రుచిగా వంట‌కాల‌ను అందించాలి. ఎప్పుడూ ఒకే ర‌క‌మైన వంటకాలు కాకుండా, ప‌లు ప్ర‌త్యేక‌మైన వంట‌కాల‌ను భోజ‌న ప్రియుల‌కు అందివ్వాలి. అలాగే త‌మ బ్రాండ్‌ను విస్త‌రించేందుకు త‌మ‌కే ప్ర‌త్యేక‌మ‌య్యేలా, త‌మ వ‌ద్దే ల‌భించేలా.. ఏవైనా ప్ర‌త్యేక వంట‌కాల‌ను క‌స్ట‌మ‌ర్ల‌కు అందివ్వాలి. దీంతో క‌స్ట‌మ‌ర్ల సంఖ్య బాగా పెరిగి వ్యాపారం అన‌తి కాలంలోనే వృద్ధి చెందుతుంది.

ఇక క్యాంటీన్‌ల‌ను నిర్వ‌హించే స‌మ‌యాలు కూడా ముఖ్య‌మే.. క‌నుక బ్రేక్‌ఫాస్ట్ అయితే ఉద‌యం స‌మ‌యంలో.. అదే భోజ‌నం అయితే మ‌ధ్యాహ్నం, రాత్రి స‌మ‌యాల్లో.. స్నాక్స్ అయితే సాయంత్రం స‌మ‌యాల్లో క్యాంటీన్‌ను నిర్వ‌హించాలి. మొబైల్ క్యాంటీన్ల‌ను ఎక్క‌డైనా నిర్వ‌హించే అవ‌కాశం ఉంటుంది క‌నుక‌.. వీలైనంత వ‌ర‌కు ఒకే ప్ర‌దేశంలో కొంత కాలం మొద‌ట‌గా వ్యాపారం చేయాలి. ఆ త‌రువాత వ్యాపారంలో వ‌చ్చే లాభాలు, జ‌నాలు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల‌ను బ‌ట్టి క్యాంటీన్‌ను తిప్పుతూ వ్యాపారం చేయాలి. దీంతో త‌క్కువ కాలంలోనే ఈ బిజినెస్ ద్వారా లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

ఇక ఈ వ్యాపారం ద్వారా నెల‌కు రూ.ల‌క్ష‌ల్లో సంపాదించేందుకు అవ‌కాశం ఉంటుంది. అది ఎవ‌రైనా స‌రే.. వారు పెట్టే పెట్టుబ‌డిని బ‌ట్టి ఉంటుంది. అలాగే మొబైల్ క్యాంటీన్‌ను నిర్వ‌హించే ప్ర‌దేశం.. అందించే ఆహారం.. జ‌న సాంద్ర‌త‌.. త‌దిత‌ర అంశాల‌ను బ‌ట్టి కూడా ఆదాయం మారుతుంది. అయితే ప్ర‌స్తుతం చాలా మంది మొబ‌ల్ రెస్టారెంట్ల య‌జ‌మానులు నిత్యం రూ.5వేలు మొద‌లుకొని రూ.25వేల వ‌ర‌కు సంపాదిస్తున్నారు. ఈ క్ర‌మంలో వ్యాపారం విజ‌య‌వంతం అయితే నెల‌కు ఎంత వ‌ర‌కు సంపాదించ‌వ‌చ్చో.. ఎవ‌రైనా.. ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. అయితే ఈ బిజినెస్ ఒక్క‌సారి గ‌న‌క‌ విజ‌య‌వంతం అయితే.. నెల నెలా రూ. ల‌క్ష‌ల్లో మాత్రం క‌చ్చితంగా ఆదాయం వ‌స్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version