సాధారణంగా చాలా మంది మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి కాల్ మాట్లాడుతుంటారు. దీనివల్ల కొన్నిసార్లు ప్రమాదాలకు గురై చనిపోతుంటారు. అయితే ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడటం నిజంగా ప్రమాదకరమేనా అంటే సరైన సమాధానం లేదు. ఎందుకంటే విద్యుత్ సరఫరాలో ఫ్లక్చువేషన్స్ ని బట్టి ఈ ప్రమాదస్థాయి ఆధారపడి ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండటానికి ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు మాట్లాడకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నాయి. అయితే కొందరు మాత్రం దీన్ని పట్టించుకోకుండా మొబైల్ ఛార్జింగ్ లో ఉండగానే మాట్లాడుతూ కొన్ని సార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఏపీలోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.
నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం ముత్తోలినగర్‌కు చెందిన ఎస్.సాల్మన్, సులోచన దంపతుల కుమారుడు ప్రవీణ్ కుమార్ (29) మంగళవారం సాయంత్రం వర్షం పడుతుండగా.. ఇంట్లో సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెట్టాడు. అప్పుడే ఫోన్ రావడంతో ఛార్జింగ్‌లో ఉంటుండగానే మాట్లాడాడు. ఈ క్రమంలో ఉరుములు, మెరుపులు రావడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సీతారామపురం పీహెచ్‌కి తరలించగా మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
ప్రవీణ్ కుమార్ పాస్టర్‌గా శిక్షణ తీసుకున్నాడు. మరో రెండు నెలల్లో పాస్టర్‌గా పనిచేసేందుకు వెళ్లాల్సి ఉందని అతడి సోదరుడు ప్రశాంత్ తెలిపారు. చేతికి అందివచ్చిన కుమారుడు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడంతో ఆ దంపతులు బోరున విలపిస్తున్నారు.