పబ్‌జి మొబైల్ గేమ్ వల్ల గతంలో పలువురు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే పంజాబ్‌లో మాత్రం ఓ యువకుడు ఆ గేమ్ కోసం ఏకంగా తండ్రి బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.16 లక్షలు ఖర్చు పెట్టాడు. నిజానికి ఆ యువకుడి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. వేరే దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. పంజాబ్‌లో ఆ యువకుడు తన తల్లి దగ్గర ఉంటున్నాడు. అయితే ఆన్‌లైన్‌లో చదువుకోవాలని చెప్పి ఆ యువకుడు తన తల్లి స్మార్ట్‌ఫోన్‌ను తీసుకునేవాడు. అందులోనే పబ్‌జి గేమ్‌ను ఆడేవాడు.
ఇక ఆ పబ్‌జి గేమ్‌కు ఆ యువకుడు బానిస అయ్యాడు. ఆ గేమ్‌లో పలు రకాల ఐటమ్స్‌ను డబ్బులు పెట్టి కొనవచ్చు. అందుకు గాను యాప్‌లో పర్చేజ్ సౌకర్యం కల్పించారు. గేమ్‌ను ఫ్రీగానే ఆడుకోవచ్చు. కానీ ఫ్రీ ప్లేయర్లకు అందుబాటులో లేని పలు ప్రీమియం సేవలు డబ్బులు కట్టే ప్లేయర్లకు లభిస్తాయి. అందుకని అతను గేమ్‌లో డబ్బు పెట్టి ఆ ఐటమ్స్‌ను కొనేవాడు. ఇక అతనేకాకుండా ఆ గేమ్ ఆడే తన స్నేహితులకు కూడా అందులో ఐటమ్స్‌ను అతను కొనివ్వడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో అతను అలా ఇప్పటి వరకు మొత్తం రూ.16 లక్షల వరకు పబ్‌జి మొబైల్ గేమ్‌లో ఖర్చు పెట్టాడు.
అయితే ఆ మొత్తం తన తండ్రి దాచుకున్న డబ్బు. తన జీవిత కాల సేవింగ్స్ మొత్తాన్ని అతని కుమారుడు ఆ గేమ్ కోసం ఖర్చు పెట్టాడు. తన తల్లి వద్ద ఉండే స్మార్ట్‌ఫోన్‌కు బ్యాంక్ అకౌంట్ లావాదేవీల మెసేజ్‌లు వస్తాయి. అయితే ఎలాగూ ఫోన్ ఆ యువకుడి దగ్గరే ఉంటుంది కనుక అకౌంట్ నుంచి డబ్బును ఖర్చు పెట్టినప్పుడల్లా వచ్చే మెసేజ్‌లను అతను డిలీట్ చేసేవాడు. దీంతో అతని తల్లికి కూడా విషయం తెలియలేదు. ఇక నెల అయిపోయి మరొక నెల వచ్చింది. దీంతో బ్యాంక్ వారు స్టేట్‌మెంట్ పంపారు. అందులో చూసేసరికి ఆ యువకుడి తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు. ఏం జరిగిందో అర్థం కాలేదు. బ్యాంకులో దాచుకున్న డబ్బులను ఎవరు కాజేశారోనని వారు కంగారు పడ్డారు. కానీ చివరకు తమ కుమారుడే పబ్‌జి మొబైల్ గేమ్ కోసం ఆ మొత్తాన్ని ఖర్చు చేశాడని తెలియడంతో వారు కుమిలిపోతున్నారు. ఆ తండ్రి తన జీవితకాలం ఉద్యోగం చేసి దాచుకున్న మొత్తాన్ని తన కుమారుడు అలా ఖర్చు పెట్టే సరికి అతనికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. కాగా పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అయితే మరోవైపు కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ సారి వేసవిలో పెద్ద ఎత్తున జనాలు ఇండ్లకే పరిమితం కావడంతో వారిలో చాలా మంది పబ్‌జి మొబైల్ గేమ్‌ను ఆడారు. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా కేవలం మే నెలలోనే పబ్‌జి గేమ్ డెవలపర్లకు రూ.1668 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక ఆ గేమ్‌ను లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు బ్లూ హోల్ కంపెనీ ఏకంగా రూ.22,457 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఏది ఏమైనా.. నిజంగా ఆ తండ్రి లాంటి స్థితి ఎవరికీ రాకూడదు.