ఏపీ సీఎం జగన్ చురుకైన వాడే కాదు, తెలివైనవాడు అనే విషయాన్ని ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటూనే వస్తున్నారు. ఎంత పెద్ద వివాదాలు చుట్టుముట్టినా, అవేవీ అంత పెద్ద విషయం కాదు అన్నట్టుగా చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు. చాలా కూల్ గానే అన్ని సమస్యలను పరిష్కరించుకునే విధంగా జగన్ ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తూ ఉంటారు. కొద్ది రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులకు సంబంధించి డిక్లరేషన్ పై పెద్ద దుమారమే చెలరేగుతోంది.
ఇంతకుముందే అంతర్వేది వ్యవహారం, దుర్గమ్మ ఆలయంలో వెండి రథంపై ఉండే మూడు సింహాలు మాయమవడం, ఇలా ఎన్నో సమస్యలతో వైసిపి ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. బిజెపి సైతం జగన్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తోంది. ఈ విమర్శలకు మరింత ఆజ్యం పోస్తూ, ఏపీ మంత్రి కొడాలి నాని ప్రధాని నరేంద్ర మోదీ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఇక నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సైతం బిజెపి విమర్శలను తిప్పికొడుతూ, జగన్ మరో 25 ఏళ్ల పాటు డిక్లరేషన్ ఇవ్వరని, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ప్రతిపక్షాలను ఉద్దేశించి విమర్శలు చేశారు. ఈ వ్యవహారంలో జగన్ బిజెపి ఆగ్రహానికి గురయ్యారు అని అంతా అనుకుంటున్న సమయంలో, జగన్ అకస్మాత్తుగా తిరుమలకు వెళ్లి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ డిక్లరేషన్ వ్యవహారంలో జగన్ సంతకం చేస్తారా ? బీజేపి ఆగ్రహం నుంచి ఎలా తప్పించుకుంటారు అని అంతా సందేహంలో ఉండగానే వాటన్నింటికీ జగన్ చెక్ పెడుతూ, చాలా సమయస్ఫూర్తిని ప్రదర్శించారు.
స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమానికి ముందుగానే ఆయన పంచె కట్టు , నుదుట నామాలు పెట్టుకొని అందరికీ షాక్ ఇచ్చారు. జగన్ ఒక్కసారిగా అలా కనిపించేసరికి బీజేపీ, టీడీపీ లు సైతం అవాక్కయ్యారు. దీనిపై వారికి నోరు మెదిపేందుకు అవకాశం లేకుండా పోయింది. పదేపదే డిక్లరేషన్, హిందుత్వం విషయంలో జగన్ పై వచ్చిన విమర్శలకు నామాలు, పంచె కట్టుతో తేల్చేశారు. దీంతో ఈ వ్యవహారానికి జగన్ పులిస్టాప్ పెట్టేసినట్లు గానే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కేంద్ర బీజేపీ పెద్దలను కలిసి జగన్ అన్ని వ్యవహారాలపైన క్లారిటీ ఇచ్చేసారు. వారు కూడా సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలు సైలెంట్ గానే కనిపిస్తున్నారు. ఇప్పుడు జగన్ ఈ విధంగా కనిపించడంతో ఇక ఈ వివాదానికి ముగింపు చెప్పేసి జగన్ శుభం కార్డు వేసేసినట్టుగా కనిపిస్తున్నారు.
-Surya